హైదరాబాద్, అక్టోబర్ 11 : హుద్‌హుద్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను పరిస్థితి సమీక్షించారు. తుపాను ప్రభావంతో ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఐదు జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ఐదు జిల్లాల్లో హుద్‌హుద్ తుపాను ప్రభావం ఉండనుంది. 64 మండలాల్లోని 436 గ్రామాల్లో 5.14 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 370 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం 54 బోట్లు, 13 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 15 శాటిలైట్ ఫోన్లు, 689 మంది గజీతగాళ్లు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, విపత్తు నిర్వహణశాఖ అధికారులు పాల్గొన్నారు.




