గుజరాత్ కాదు మహరాష్ట్రే మోడల్
మోడీ నీ ప్రతాపం ఇంతేనా : రాహుల్
హర్యానా, అక్టోబర్ 12 (జనంసాక్షి) : ప్రధాని మోడీ గారూ.. నల్లడబ్బు తీసుకొస్తామన్నారు.. ఏమైంది? అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. గుజరాత్ మోడల్ కాదని మహరాష్ట్రే మోడల్ అని ఆయన అన్నారు. మోడీ నీ ప్రతాం ఇంతేనా? అని ఎద్దేవా చేశారు. సరిహద్దులో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలపై రాహుల్ మోదీని తీవ్రంగా విమర్శించారు. చైనా చొరబాట్లపైనా నిలదీశారు. చైనా చొరబాట్ల అంశాన్ని చైనా అధ్యక్షుడి ముందు కూడా ప్రధాని ప్రస్తావించలేదన్నారు. పాక్‌ను మన జవాన్లు నోరుమూయించారని, సరిహద్దులో పరిస్థితి మామాలు స్థితికి చేరుకుంటోందని మోదీ హావిూఇచ్చిన మరుసటి రోజునే ఆయనపై రాహుల్ విమర్శలు పెంచారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఫిరోజ్‌పూర్ జిర్కా, రేవారీ, గన్నౌర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం నిర్వహించారు. ప్రధానినైతే తాను పాకిస్థాన్, చైనాలను కట్టడిచేస్తానంటూ మోదీ హావిూఇచ్చారని, అయినా సరిహద్దులో కాల్పులు జరుగుతూనే ఉన్నాయని, జనం చనిపోతూ ఉన్నారని రాహుల్ అన్నారు. ‘సరిహద్దులో మామూలు పరిస్థితులు ఏర్పడుతాయని కొన్ని రోజుల కిందట చెప్పారు. కాల్పులు పూర్తిగా ఆగిపోయాయంటూ శుక్రవారం చెప్పారు. ఈ రోజు (శనివారం) మళ్లీ కాల్పులు మెదలయ్యాయి.’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ బహిరంగ సభ జరిగిన కొన్నిగంటలకే సిర్సాలోనే జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. మహారాష్ట్రలోని రాంటెక్‌ను ప్రముఖ పర్యాటకకేంద్రంగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన రాంటెక్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలోనూ మాట్లాడారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర భాజపా నేతలు అభివృద్ధి ముసుగుతో ప్రజలను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. వాస్తవానికి అభివృద్ధిలో గుజరాత్ కన్నా మహారాష్ట్ర ముందుందని ఆయన తెలిపారు. ఆదివారం నాగపూర్ జిల్లాలోని రామ్‌టెక్ ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ భాజపా నేతల విమర్శలను తిప్పికొట్టారు. అరవై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఈ దేశానికి చేసిందేమీ లేదని కాషాయపార్టీ నేతలు అంటున్నారు..అదే నిజమైతే భారత్‌లో జరిగిన అభివృద్ధి ఎవరు చేశారని ప్రశ్నించారు. పదే పదే మహాత్మగాంధీ గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ.. గాంధీజీ సిద్ధాంతాలను మాత్రం ఆచరించట్లేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోగా విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని చెప్పిన భాజపా నేతలు ఇప్పుడు దానిపై మాట్లాడటం లేదన్నారు. యూపీఏ అవలంభించిన విధానాలతో దేశంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెరిగాయని రాహుల్ వివరించారు.





