న్యూఢిల్లీ అక్టోబర్ 14 (జనంసాక్షి) : పెట్రోల్ ధర లీటరుకు రూపాయి తగ్గింది. స్థానిక పన్నుల్లోనూ తగ్గింపు కలుపుకుంటే ప్రాంతాల వారీగా మరికొంత తగ్గనుంది. తగ్గించిన ధర మంగళవారం అర్ధరాత్రి అమల్లోకి వస్తుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. పెట్రోల్ ధర తగ్గించడం ఈనెలలో ఇది రెండోసారి. అక్టోబర్ 1న లీటర్ పెట్రోల్ ధరపై 54 పైసలు తగ్గింది. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.66.65కు, ముంబైలో రూ.74.46 చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గడంతో ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్ ధర తగ్గించాయి.
డీజిల్ ధర లీటరుకు రూ. 2.50 తగ్గే అవకాశం
అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణించడంతో డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. లీటర్ డీజిల్ ధర 2.50 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉండటం కారణంగా డీజిల్ రేటు తగ్గింపుకు అవరోధంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అని డీజిల్ ధరల తగ్గింపు అంశంపై పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.





