
చిన్నారి సాదిక్ కోరిక నెరవేర్చిన పోలీసులు
హైదరాబాద్, అక్టోబర్ 15 (జనంసాక్షి) : కరీంనగర్ జిల్లాకు చెందిన పిల్లాడు కమిషనరేట్‌లో హల్‌చల్ చేశాడు. పదేళ్ల కుర్రాడు ఒక రోజు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాడు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న కరీంనగర్ జిల్లాకు చెందిన సాదిక్ (10) కోరికను హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సహకారంతో స్వచ్ఛంద సంస్థ మేక్ ఏ విష్ నెరవేర్చింది. కరీంనగర్‌కు చెందిన సాదిక్ చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న అతడికి పోలీసు కమిషనర్ కావాలన్నది కోరిక. అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్నారుల కోరికను నెరవేర్చే స్వచ్ఛంద సంస్థ ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ ఈ విషయం తెలిసి హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలిసింది. సాదిక్ కోరిక గురించి వివరించి, ఒకరోజు కమిషనర్‌గా పని చేసేందుకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేసింది. స్వచ్ఛంద సంస్థ విజ్ఞప్తితో సీపీ మహేందర్‌రెడ్డి చిన్నారి కోరికను నెరవేర్చేందుకు అవకాశమిచ్చారు. దీంతో బుధవారం ఉదయమే సాదిక్ నివాసానికి బుగ్గకారు చేరుకుంది. కారులో కమిషనరేట్‌కు వచ్చిన సాదిక్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అతడికి రెడ్‌కార్పెట్ స్వాగతం పలికిన ఉన్నతాధికారులు సాదరంగా కమిషనరేట్ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం నగర పోలీసు కమిషనర్‌గా సాదిక్ బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ సీట్లో ఠీవీగా కూర్చున్న సాదిక్ ఒకింత ఆనందపారవశ్యానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాదిక్ మాట్లాడారు. హైదరాబాద్‌లో రౌడీలను రూపుమాపుతానని ప్రకటించారు. కమిషనర్ మహేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సాదిక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అందరిలాగే బాగా చదువుకొని పైకి ఎదగాలని కోరుకున్నారు. బాలుడి కోరిక తీర్చడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. తన కుమారుడి కోరిక నెరవేర్చినందుకు సాదిక్ తండ్రి కమిషనర్‌తో పాటు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మేక్ ఏ విష్ పౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్నారుల కోరికలను తెలుసుకొని వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మానవతా దృక్పథంతో సహకరించిన పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు. బాధితులు త్వరగా కోలుకొనేలా పెద్ద మనసుతో చేయూతనివ్వాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తిచేశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్నారుల కోరికలను తీరచేందుకు సెలబ్రిటీలు ముందుకురావాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు గతంలో శరత్ అనే బాలుడి కోరికను నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. ఖమ్మంలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న శ్రీజ అనే బాలికకు సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ను కలవాలన్నది కోరిక అని, అందుకు పవన్‌కల్యాణ్ సహకరించాలని సంస్థ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.




