వైద్య పరిశోధనల్లో మనం వెనుకబడ్డాం
మరింత ముందుకు వెళ్లాలి
ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్రమోడీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 20 (జనంసాక్షి) :
ప్రతిఒక్కరూ అనునిత్యం విద్యార్థేనని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. వైద్య పరిశోధనల్లో మనం వెనుకబడి ఉన్నామని, మరింత ముందుకు వెళ్ళాలని సూచించారు. ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. వైద్య పరిశోధనల్లో భారత్ వెనుకబ డిందని, మరింత ముందుకు దూసుకెళ్లాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. అందరూ నిత్య విద్యార్థులుగా ఉండాలని, మనలోని విద్యార్థిని ఎప్పుడూ మేల్కొలిపే ఉంచాలని సూచించారు. సోమ వారం న్యూఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 42వ
స్నాతకోత్సవంలో పాల్గొన్న మోడీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘వైద్య పరిశోధనల్లో భారత్ చాలా వెనుకబడి ఉంది. సాధించాల్సింది ఎంతో ఉంది. మనం పరిశోధనలు, ప్రధానంగా చరిత్రపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని’ అన్నారు. తాను మంచి విద్యార్థిని కాదని, ఎప్పుడూ అవార్డు అందుకోలేదని తెలిపారు. చదువు ముగించుకొని బయటకు వెళ్తున్న విద్యార్తులను ఉద్దేశించి.. ‘ఇంతటితో తమ విద్యార్థి దశ ముగిసిపోయిందని అనుకోవద్దు. నిత్య విద్యార్థిగా ఉంటూ ప్రతీది నేర్చుకోవాలని’ మోడీ సూచించారు. ఎల్లప్పుడూ విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలని.. విద్యార్థి దశ అయిపోయిందని ఎప్పుడూ అనుకోవద్దని విద్యార్థులకు సూచించారు.
స్నాతకోత్సవానికి ఓ సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తిని అతిథిగా పిలవడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు స్ఫూర్తి పొందుతారని, వారి జీవితాల్లోనూ ఇది సాధ్యమే అనే భావన కలుగుతుందన్నారు. ఈ భావన విద్యార్థుల్లో ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందని అభిప్రాయపడ్డారు. ‘స్నాతకోత్సవాలకు ప్రత్యేక అతిథిని పిలవడం ఎందుకు సంప్రదాయంగా మలచుకోకూడదు? గ్రామానికి చెందిన 8-9 తరగతి చదివిన విద్యార్థి ప్రత్యేక అతిథి పిలిస్తే.. పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులు స్ఫూర్తి పొందుతారు. తమ జీవితాల్లోనూ ఇది సాధ్యమే అన్న భావన వారిలో కలుగుతుంది’ అని అన్నారు.





