పురుషులకు ఏడాది.. మహిళలకు ఆరు నెలల శిక్ష
హైదరాబాద్, జనవరి 9 (జనంసాక్షి) :
ఆదాయపన్ను ఎగవేతపై సత్యం అధినేత రామలింగరాజుపై కోర్టు తీర్పు ఇచ్చింది. రామలింగరాజుతో సహా పలువురికి ఏడాది జైలు శిక్ష విధించింది. సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థల ఆదాయనుపన్ను ఎగవేత కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 19 సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థలకు చెందిన 84 మంది డైరెక్టర్లకు జైలు శిక్ష విధించింది. శిక్ష పడిన వారిలో సత్యం రామలింగరాజు భార్య నందిని, కుమారులు రామరాజు, తేజరాజు సోదరుడి భార్య రాధ ఉన్నారు. మహిళా నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించింది. పురుషులకు ఏడాది జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా వేసింది. కోర్టు శిక్షలు స్త్రీ, పురుషులకు వేర్వేరుగా నిర్ణయించింది. పురుషులకు ఏడాది, స్త్రీలకు ఆరు నెలల పాటు శిక్ష విధించింది. అయితే నిందితుల అభ్యర్థన మేరకు తీర్పు అమలును నెల రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి లక్ష్మణ్ తెలిపారు. కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు నిందితులు తెలిపారు. నిందితులపై ఐటీ చట్టం 276 సి(2), 278 (బి) నిబంధనల ప్రకారం కేసులు నమోదయ్యాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితులంతా ఆదాయ పన్ను చెల్లింగల సామర్థ్యం ఉన్నా ఉద్దేశపూర్వకంగా చెల్లించడం లేదని వాదించారు. ఈ విషయాన్ని వారి సంస్థల పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
రామలింగరాజు సహా 84 మంది డైరెక్టర్లకు జైలు




