సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
ఖమ్మం, జనవరి 9 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన తర్వాతనే ఇతర పార్టీలతో పొత్తుల గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తెలిపారు. అయితే ఐదు లోక్‌సభ స్థానాలు, 45 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలనే ఆలోచనలో సిపిఐ ఉందని ఆయన చెప్పారు. గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ”పొత్తు గురించి సిపిఎంతో సంప్రదింపులు జరుగుతున్నాయి. కానీ అటువైపు సరైన స్పందన రావడంలేదు” అని నారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా బిజెపి, టిడిపి మధ్య అలాగే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య అవగాహన లేదా పొత్తు ప్రతిపాదన గురించి తనదైన ధోరణిలో మాట్లాడుతూ ఈ పార్టీలు రాజకీయ ”వ్యభిచారానికి” పాల్పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశంపై స్పష్టత లేదని పార్టీలకు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని కూడా నారాయణ తెలిపారు. ఘజియాబాద్‌లో బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని సిపిఐ నాయకుడు ఖండించారు. దాడి వెనుక బిజెపి. భజరంగ్‌దళ్ ఉన్నాయని ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కిరణ్, మంత్రి వట్టి వసంత్ కుమార్‌లను ఆయన తప్పుపట్టారు. తెలంగాణపై సిడబ్లూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆ నాయకులపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు చర్య తీసుకోవడంలేదని నారయణ ప్రశ్నించారు. పాలెం బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విభజన తర్వాతే పొత్తులు




