కరీంనగర్,ఫిబ్రవరి23(జనంసాక్షి): మిషన్ కాకతీయలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చి కథనాలు రాసిన పాత్రికేయులకు తాను నగదు బహుమతులు ఇస్తానని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చెరువుల పునరుద్దరణ పేరుతో అక్రమాలకు తెరలేపారని అన్నారు. జిల్లాలో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యహరిస్తుందని ధ్వజమెత్తారు. నెలలు గడుస్తున్నప్పటికి రైతుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయిందనిఆయన మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ అసంపూర్తిగా ఇవ్వడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రైతులందరికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ విషయంలో ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. స్కాలర్షిప్ కుంభకోణంలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. తెరాస హయాంలో అభివృద్ధిశూన్యమని విమర్శించారు. తెరాస ప్రభుత్వం ఎన్నికల ముందుప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస నాయకులు రాజకీయలబ్ది కోసం పాటు పడుతూ, పదవి దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లా ప్రజలకు తాగు సాగు నీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలన్నారు. వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.




