Tuesday, 3 November 2026

acతెలంగాణ అంతటా బ్లాక్‌డే


పలుచోట్ల ఉద్రిక్తత
అవతరణ వేడుకలకు టీ మంత్రులు దూరం
ఖాళీ కుర్చీలు జనం లేక వెలవెలబోయిన ‘ఉత్సవం’
హైదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని ‘బ్లాక్‌ డే’గా పాటించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా బ్లాక్‌ డేగా పాటించారు. పది జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలు ఎగురవేసి తెలంగాణవాదులు తమ నిరసన తెలిపారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మంత్రులు జాతీయ జెండాను ఎగరవేయాల్సి ఉండగా, తెలంగాణ ప్రాంత మంత్రులు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. తెలంగాణ భవన్‌లో నాయిని నర్సింహారెడ్డి, టీ జేఏసీ కార్యాలయంలో నాయకులు నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. వరంగల్‌, కలెక్టర్‌ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్‌ కాన్వాయ్‌ను తెలంగాణ విద్యార్థులు అడ్డుకున్నారు. కలెక్టర్‌ కార్యాలయంపై నల్లజెండా ఎగురవేశారు. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి కార్యాలయాలపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కార్మికులంతా నల్లబ్యాడ్జిలు ధరించి కార్యాలయాలపై నల్లజెండాలు ఎగురవేశారు. పలు చోట్ల కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. నల్గొండ జిల్లాలో జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలు ఎగురవేశారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జాతీయ రహదారిపై అక్కడక్కడ రాస్తారోకో నిర్వహించారు. నిరసన వ్యక్తం చేశారు. వరంగల్‌ జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలు ఎగురవేశారు. అక్కడక్కడ ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు కె.తారకరామారావు నాయకత్వంలో బ్లాక్‌ డేగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని జిల్లాల్లో న్యాయవాదులు కోర్టులపై నల్లజెండాలు ఎగురవేశారు. ఖమ్మం జిల్లాలో తెలంగాణవాదులు ఉద్రిక్తతల మధ్య బ్లాక్‌ డేను పాటించారు. తెలంగాణలోని మెదక్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో విద్రోహదినాన్ని జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *