కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై హైకోర్టు కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారని.. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరుద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. విచారణ చేపట్టిన హైకోర్టు జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులను తొలగించ వద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక ముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని తెలిపింది. రాష్ట్రంలో ఇక నుంచి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు (ఒకేషనల్), 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులు ఉన్నారు.