న్యాక్ గుర్తింపునకు కొత్త రూల్స్.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ కాలేజీల తనిఖీలు
హైదరాబాద్, ఆగస్టు 11 ఐదు గ్రేడ్లుగా కాలేజీలకు గుర్తింపుకాలేజీలను గుర్తించే విధానాన్ని సమూలంగా మార్చేందుకు న్యాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) చర్యలు చేపట్టింది. అందుకోసం కొత్త నిబంధనలను రూపొందిస్తున్నది. తదనుగుణంగా ఇకపై ఏ, బీ, సీ, డీ గ్రేడ్లకు బదులుగా 5 స్థాయిల్లో మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్లు (ఎంబీజీఏ) జారీచేయనున్నది. దీనిపై న్యాక్ ఇటీవల బెంగళూరులో విసృ్తతస్థాయి సమావేశాలను నిర్వహించింది. దక్షిణాది రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లతోపాటు పలువురు విద్యారంగ నిపుణులను ఈ సమావేశాలకు ఆహ్వానించి, న్యాక్ నిబంధనలను మరింత సరళతరం చేసేందుకు చేపడుతున్న చర్యలను వివరించింది. కొత్త నిబంధనలపై రాష్ట్రాల స్థాయిలో అవగాహన కల్పించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అమలు చేసేందుకు సిద్ధమవ్వాలని సూచించింది. ఇప్పటివరకూ న్యాక్ గుర్తింపు కోసం కొన్ని కాలేజీలు మాత్రమే పోటీపడేవి. కానీ, ఇకపై అన్ని కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందేలా ప్రోత్సహించేందుకు మార్గదర్శకాలను సవరించారు. న్యాక్ గుర్తింపును ఇచ్చేందుకు అనుసరిస్తున్న ప్రామాణికాలను 7 నుంచి 10కి పెంచారు. దీంతో ఇకపై కాలేజీలకు సంబంధించిన ఐదేండ్ల డాటాను న్యాక్ బృందం పరిశీలిస్తుంది. మౌలిక సదుపాయల పెంపు, ఫ్యాకల్టీ, ఫలితాలు, ఉపాధి అవకాశాలు, సొంత బిల్డింగ్ ఉన్నదా? లేదా? అనే అంశాలను పరిశీలించి కాలజీలకు మారులు ఇస్తుంది. గతంలో ఉన్న నిబంధనలతో కొన్ని కాలేజీలు మాత్రమే న్యాక్ గుర్తింపును పొందగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలను సరళీకరించాలని న్యాక్ నిర్ణయించింది.