Wednesday, 4 November 2026

అంగన్‌వాడీల ఎత్తివేతకు కుట్ర

కర్నూలు,నవంబర్‌19(జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు విమర్శించారు. ఈ అంగన్‌వాడీ కేంద్రాలకు రానురాను కేంద్ర బ్జడెట్‌లో నిధులు కుదించి ప్రయివేటు సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేలో భారతదేశం ఆకలి దేశాల్లో 102వ స్థానంలో నిలిచిందన్నారు. ప్రజారోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం వల్ల అంగన్‌వాడీ సెంటర్లు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. మూడేళ్ల నుంచే పిల్లలను పాఠశాలలకు పంపాలనే నిర్ణయం నూతన విద్యావిధానంలో భాగంగా రాబోతుందని తెలిపారు. దీనివల్ల అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడే ప్రమాదం ఉందని చెప్పారు. కేంద్రాలను అక్షయపాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పాలన్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు పెరిగాయని చెప్పారు. గుంటూరులో అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్య సంఘటన అనంతరం పెద్దఎత్తున ఉద్యమించాక రాజకీయ వేధింపులు తగ్గాయన్నారు. ఎక్కడైనా రాజకీయ వేధింపులు చోటు చేసుకుంటే ఎక్కడికక్కడ ఆందోళనలు కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.