Wednesday, 4 November 2026

అకాల వర్షం అపార నష్టం

1

తెలంగాణ అంతటా భారీ వర్షాలు

ధ్వంసమైన వరి, మొక్కజొన్న, పత్తి, మామిడి పంటలు

హైదరాబాద్‌,ఏప్రిల్‌13(జనంసాక్షి): రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలువురు మృత్యువాత పడ్డారు. వరి, మొక్కజొన్న, మిర్చి, పసుపు, మామిడి తదితర పంటలు నీట మునిగి భారీగా నష్టం సంభవించింది. చేతికొచ్చిన పంట నాశనమవటంతో రైతులు బోరున విలపిస్తున్నారు. ముఖ్యంగా, ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో నష్టం తీవ్రంగా ఉంది. ఖమ్మం జిల్లాలో  కురిసిన అకాల వర్షం కారణంగా వేలాది ఎకరాల్లో లక్షల రూపాయల నష్టం వాటటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా మామిడి  పంటలు దెబ్బతిన్నాయి. అయితే  వాతావరణం చల్లబడటంతో వేసవిలో ప్రజలకు ఉపశమనం పొందారు. వీటికితోడు  మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.  ఈదురు గాలులకు చేతికి వచ్చిన మామిడి పంట నేలరాలింది. వరుసగా  కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల వరి నీట మునిగింది. మామిడి నేలరాలింది. మార్కెట్లకు తీసుకొచ్చని పంట కొట్టుకుని పోయింది. ఉన్నపంట నేలరాలడంతో  రైతాంగానికి తీవ్ర నష్టం కలిగింది. ఇలా అకాల వర్షాలతో జిల్లా తడిసిముద్దయింది. కొన్నచోట్ల వడగళ్ల వానలు కురిసాయి.  జిల్లాలోని నేలకొండపల్లి, కొత్తగూడెం మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. వాజేడు, వెంకటాపురం, తిరుమలాయపాలెం మండలాల్లో చినుకులతో పాటు ఈదురు గాలులు వీచాయి. అశ్వారావుపేట, కల్లూరు, దమ్మపేట, సత్తుపల్లి ప్రాంతాల్లో ఈదురు గాలులకు మామిడి రైతులకు స్వల్ప నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. పలు మండలాల్లో కల్లాల్లో ఆరబోసిన మిర్చిని రైతులు టార్పాలిన్లతో కాపాడుకున్నారు. కొన్నిచోట్ల పంట తడిసిపోతుందని బాధితులు వాపోయారు. ఇప్పటికే కోతకు వచ్చిన రబీ వరిని కోయడం మొదలు పెట్టారు. సాగర్‌ ఆయకట్టు పరిధిలో కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. పొలాల్లోని పనలపైనే పంట ఉంది. కొన్ని చోట్ల పొట్ట దశలో పైరు ఉంది. పొట్టదశలో పైరు ఉండటంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మరో ప్రధాన పంట మొక్కజొన్న కంకులు కొన్ని చోట్ల కల్లాల్లోనే ఉండటంతో రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు.

నల్లగొండ అన్నదాతపై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. నకిరేకల్‌, రామన్నపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోని ధాన్యపు రాశులు అర్ధరాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయాయి.  వర్షం కారణంగా ధాన్యం మురుగుకాల్వ పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్‌యార్డులో 13వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కోసం తీసుకొచ్చారు. అకాలవర్షానికి కేవలం 300 క్వింటాళ్ల ధాన్యం తడిసిందని అధికారులు వివరిస్తున్నా.. రైతు సంఘాల ప్రతినిధులు మాత్రం యార్డులో పదివేల బస్తాల ధాన్యం తడిసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామన్నపేట మార్కెట్టు యార్డులో 2వేల క్వింటాళ్ల ధాన్యం తడిసింది. శోభనాద్రిపురం, లక్ష్మాపురం, మునిపంపుల, కక్కిరేణి ఐకేపీ కేంద్రాల్లోనూ నిల్వ ఉన్న ధాన్యం తడిసింది. మండలవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో సుమారు 7వేల క్వింటాళ్లవరకు ధాన్యం తడిసినట్లు అంచనా. అన్ని వసతులున్న మార్కెట్‌యార్డుల్లోనూ ధాన్యం తడిసిపోవడం యార్డు అధికారుల లోపాలను తేటతెల్లం చేస్తోంది. ధాన్యం రాసులపై కప్పేందుకు టార్ఫాలిన్ల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షంతో ఇవి బట్టబయలు అయ్యాయి. నకిరేకల్‌ మార్కెట్‌లో రైతులకు చాలా వరకు చిరిగి.. రంధ్రాలుపడి పనికిరాకుండా పోయిన టార్ఫాలిన్లను సరఫరాచేశారు. అవి కప్పినా.. ధాన్యం తడిసిందని రైతులు వివరించారు. నకిరేకల్‌ యార్డులో 500 వరకు టార్ఫాలిన్లు ఉన్నా.. వీటిలో సగం వరకు చిరిగి చాటంత రంధ్రాలతో ఉన్నాయి. ఇలా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అసౌకర్యాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస వసతులు లేక రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా ముందుస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులు సూచిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.  అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. తాత్కాలిక వసతుల మధ్య గ్రామాల్లో ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి ఎక్కువ నష్టం వాటల్లింది. మార్కెటింగ్‌, డీఆర్‌డీఏ వద్ద ఉన్న టార్ఫాలిన్లను అవసరమైన రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్‌ శాఖ జిల్లా ఏడీ అన్నారు.  3వేల టార్ఫాలిన్లు ఉన్నాయని, వీటిని సకాలంలో రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నకిరేకల్‌ మార్కెట్‌యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో స్థానిక తహసీల్దారు పరిశీలించారు. 300 క్వింటాళ్ల ధాన్యం వర్షానికి తడిసినట్లు మార్కెట్‌ అధికారులు నివేదించారు.  రామన్నపేటలోని వ్యవసాయ మార్కెట్టు యార్డులో తడిసిన ధాన్యాన్ని సీపీఎం నాయకులు పరిశీలించారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.  మునిపంపులలోని ఐకేపీ కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని బిజెపి నాయకులు  పరిశీలించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. శోభనాద్రిపురంలో తెరాస నాయకుఉల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షానికి మార్కెట్‌ యార్డులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ నాయకులు  డిమాండ్‌ చేశారు.  నకిరేకల్‌ యార్డులో తడిసిన ధాన్యం పరిశీలించారు. నకిరేకల్‌ యార్డులో పది వేల బస్తాల ధాన్యం తడిసిపోయిందన్నారు. ఆరుబయట ఉన్న ధాన్యం రాశులను వెంటనే గోదాముల్లోకి తరలించాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో వరి, మిర్చి, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *