-ప్రత్యూష సిన్హా కమిటీ సిఫారసుల దస్త్రంపై ప్రధాని సంతకం
న్యూఢిల్లీ, డిసెంబర్ 24 (జనంసాక్షి): ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిలభారత సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల పంపిణీ ప్రక్రియ పూర్తి అయింది. అఖిల భారత సర్వీస్ అధికారుల పంపిణీకి సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం లభించింది. అధికారుల విభజన ఫైలుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతకం చేశారు. రెండు రాష్ట్రాలకు కేటాయించిన అధికారుల జాబితా ఎల్లుండు విడుదల చేసే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజులలో ఇందుకు సంబంధించిన జాబితాను విడుదల చేయనున్నారు. ఈ మేరకు డిఓపిటి బుధవారంనాడు ప్రధాన కార్యాలయానికి ప్రత్యూష కమిటీ సిఫార్సుల ప్రకారం ఫైలును పంపించింది. ఆ ఫైలుపై ప్రధాని సంతకం చేయడంతో ఇక సిబ్బంది కేటాయింపు చక చక జరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కమిటీ సిఫార్సుల ప్రకారం ఉత్తర్వులు అందిన వెంటనే అధికారులు సిఎస్‌లకు రిపోర్టు చేయవలసి ఉంటుంది. ఒకే పే బ్యాండ్‌కు సంబంధించిన అధికారులకు మాత్రమే క్యాడర్ మార్పునకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తున్నది. క్యాడర్ మార్పునకు స్వాపింగ్ గడువును 15 రోజులుగా నిర్ణయించినట్టు తెలుస్తున్నది.





