అగ్రిగోల్డ్ బాధితులకు..
ప్రభుత్వం న్యాయం చేయాలి
– తక్షణ ఉపశమనంగా రూ. 3,900 కోట్లు అందించాలి
– న్యాయ పోరాట దీక్ష ప్రారంభించిన అగ్రిగోల్డ్ బాధితులు
గుంటూరు, మే30(జనం సాక్షి) : అగ్రిగోల్డ్ బాధితులు పోరాటాన్ని ఉదృతం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో న్యాయపోరాట దీక్షను ప్రారంభించారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవరణలో దాదాపు రెండు వేల మంది బాధితులు బుధవారం న్యాయపోరాట దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల నుంచి.. అగ్రిగోల్డ్ ఏజెంట్లు, ఖాతాదారులు తరలివచ్చి ఈ పోరాట దీక్షలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8గంటల వరకూ ఈ దీక్ష కొనసాగుతుంది. అనంతరం అగ్రిగోల్డ్ ఆత్మఘోష యాత్ర పేరుతో వీరంతా గుంటూరు నుంచి వెలగపూడి సచివాలయం వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు. బుధవారం ప్రారంభమైన న్యాయపోరాట దీక్షలో అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు జంగాల అజయ్ కుమార్ పాల్గొనగా.. ప్రత్యేక ¬దా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులందరీకీ ప్రభుత్వం న్యాయం చేయాలని చలసాని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణ ఉపశమనంగా రూ.3,900 కోట్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి ప్రభుత్వానికి మూడేళ్లు పట్టిందని.. కొందరు అధికారులు వారికి తెరవెనుక సహకారం అందిస్తున్నారని చలసాని ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఖాతాదారులకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో గురువారం ఉదయం పాదయాత్ర ప్రారంభించనున్నామని అజయ్ కుమార్ చెప్పారు. శాంతియుతంగా చేసే తమ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించొద్దని కోరారు. ఇదిలా ఉంటే అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టే ఆత్మఘోష యాత్రకు అనుమతి లేదని పేర్కొంటుండటం గమనార్హం.
————————