అతి తెలివితేటలు మోదీ దగ్గర చూపించండి
– పోలవరం ప్రాజెక్టు పనులు 55.73శాతం పూర్తయ్యాయి
– కేంద్రం తీరుతో జాప్యం జరిగింది
– రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన దానిలో కేంద్రం నుంచి 1,935 కోట్లు రావాలి
– ప్రతి పైసా కేంద్రం ఇవ్వాల్సిందే
– భాజపా నేతలపై మండిపడ్డ మంత్రి దేవినేని ఉమా
అమరావతి, జూన్25(జనం సాక్షి ) : భాజపా నేతలు తమ అతి తెలివితేటల్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్ద చూపించుకోవాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఘాటుగా విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిధులు, విభజన హావిూలను గురించి చేతనైతే ఢిల్లీలో మాట్లాడాలని.. గల్లీలో కాదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించి లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడిన బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలన్నాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకూ 55.73 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం నిధులు సకాలంలో ఇవ్వకపోయినా.. ప్రాజెక్టు నిర్మాణం ఆగకూడదన్న లక్ష్యంతో అప్పులు తెచ్చి మరీ నిర్మిస్తున్నామని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం 400 కోట్ల రూపాయల వడ్డీలను కడుతోందని తెలిపారు. పోలవరంకు రూ. 8వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తే వచ్చింది అంతంత మాత్రమే అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా మాకు వచ్చింది రూ. 6,727కోట్లు మాత్రమేనన్నారు. మేం ఖర్చు చేసిన దాంట్లో ఇంకా కేంద్రం నుంచి రూ, 1,935 కోట్లు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. ప్రజెక్ట్ ఖర్చుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉంచామన్నారు. ప్రాజెక్టుకు ఖర్చు చేసిన ప్రతీపైసా కేంద్రం నుంచి రావాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దండగ అని విమర్శించిన అన్ని ప్రాజెక్టులకూ జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ నేతల తీరు ఏమిటో అర్ధం కావటం లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వాన్ని తిడుతున్న భాజపా నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు ఇతర రాష్ట్రాల్లోని జాతీయ ప్రాజెక్టులను పరిశీలించాలని సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన రెండో డీపీఆర్‌ను ఆమోదింప చేసుకునేందుకు జలవనరుల శాఖ అధికారులు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు ముంపు మండలాలను సాధించకపోతే పోలవరం ప్రాజెక్టు సాధ్యమయ్యేదే కాదని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రగతిని చూడలేక, తట్టుకోలేక ప్రతిపక్ష నేత జగన్ మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్‌లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.