Monday, 2 November 2026

అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హావిూలు

– పశ్చిమలో జగన్‌ పాదయాత్రకు స్పందన కరువైంది
– జగన్‌పై మండిపడ్డ నరసాపురం ఎమ్మెల్యే
నరసాపురం, మే31(జ‌నం సాక్షి) : వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అజ్ఞానం, అవగాహణ లేమితోనే తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు.  బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. శాసనసభ సమావేశాలకు రాని జగన్‌కు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కనబడటం లేదన్నారు. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే జగన్‌ ఆచరణ సాధ్యం కాని హావిూలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగన్‌ పాదయాత్రకు స్పందన కరువైందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా అభివృద్ధికి నోచుకోని నరసాపురాన్ని.. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఈ నాలుగేళ్లలో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త రహదారుల నిర్మాణానికి పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ రూ.39.68కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సత్తా ఒక్క టీడీపీకే ఉందన్నారు. జగన్‌ను మద్దతుగా నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా లేరని, జగన్‌ వస్తే ఉన్న నిధులను దోచుకుంటారనే భయంలో ప్రజలు ఉన్నారన్నారు. బీజేపీని, పవన్‌ కళ్యాణ్‌ను నమ్మే స్థితిలో లేరన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీకి పట్టం గట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.