
– ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు కుంబింగ్ నిలిపివేయండి
– బూటకపు ఎన్‌కౌంటర్‌లకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
– ప్రభుత్వ చర్యలకు టీఆర్‌ఎస్ నాయకులను హతమారుస్తాం
– మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్
ఖమ్మం నవంబర్ 19 (జనంసాక్షి):
ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ చర్ల మండలంలోని మారుమూల పూసుగుప్ప అటవీ ప్రాంతంలో తెరాస నాయకులును మావోయిస్టులు అపహరించారు. తెరాస భద్రాచలం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామకృష్ణతో పాటు చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన తెరాస నాయకులు పటేల్ వెంకటేశ్వర్లు, సురేశ్, నర్శింహరావు, సత్యనారాయణ, రామకృష్ణలను మావోయిస్టులు అపహరించారు. ఇటీవల జరిగిన వరంగల్ ఎన్‌కౌంటర్‌లో బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే తెరాస నాయకులని చంపేస్తామంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.
వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో మావోయిస్టులు అలజడి సృష్టించాలని భావిస్తున్నారా.? శృతి, సాగర్ ఎన్ కౌంటర్ల తర్వాత హెచ్చరికలు చేసిన మావోయిస్టులు.. ప్రతీకార చర్యగా ఓటింగ్ రోజును ఎంచుకున్నారా.? ఎలక్షన్స్ కు ఒక్క రోజు ముందు ఖమ్మంలో టీ.ఆర్.ఎస్ నాయకుల కిడ్నాప్…స్థానిక అగ్రనేత గాజర్ల అశోక్ అరెస్ట్, సుకుమా లో భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏం జరుగుతుందోనని ప్రభావిత ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల అశోక్ ?
భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల అశోక్ పోలీసులకు లొంగిపోయారు. అనారోగ్య కారణాలతో అశోక్ లొంగిపోయినట్లు సమాచారం. చిట్యాల మండలం వెలిశాల గ్రామానికి చెందిన అశోక్..దండకారణ్యం కార్యదర్శిగా పని చేస్తున్నాడు. మహారాష్ట్ర రాష్ట్ర కమిటి సభ్యుడిగా ఉన్నారు. ఆయన సోదరుడు గణేష్ కేంద్ర కమిటిలో సభ్యుడు. గతంలో మరో సోదరుడు సారయ్య ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. చిట్యాల, భూపాలపల్లి, ఘణపూర్, మండలాల్లో మావోయిస్టుల ప్రభావం ఉంటుందని పోలీసుల అంచనా.
ఎస్‌ఐబీ అదుపులో మావోయిస్టు అగ్రనేత జనార్దన్
ఇదిలా ఉంటే…మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత జనార్ధన్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లా వెలిశాల జనార్ధన్ స్వస్థలం. జనార్దన్‌ను విడుదల చేయాలని విరసం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా కొత్తగూడెం పోలీసులు ఎంటెక్ విద్యార్థి విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ కేసీఆర్ సభలో నిరసన తెలిపాడన్న కారణంతో విజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయ్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు పోలీసులు. విజయ్‌ది కరీంనగర్ జిల్లా వేములవాడ. అతని తల్లిదండ్రులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్‌ను విడుదల చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వరంగల్ ఎన్నికకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు-పోలీసులు
వరంగల్ ఉప ఎన్నికకు ఒక్కరోజు ముందు తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సర్వత్రా అలజడి రేకెత్తుతోంది. టీఆర్‌ఎస్ నేతల అరెస్టు, ఆదిలాబాద్ లో కాల్పులు, మావోయిస్టుల కీలక నేతల లొంగుబాట్లు, అంతు చూస్తామంటూ లేఖల విడుదల…వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరంగల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మావోయిస్టుల అలికిడి పెరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే వరంగల్ ఎన్నికకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు తెలిపారు. మావోయస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని వెల్లడించారు. ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని కొన్ని మండలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఖమ్మం, వరంగల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు.




