అనుమానం పెనుభూతమైంది

భార్య ఫోన్లో ఎవరితో మాట్లాడుతోందని ఆగ్రహం

రాడ్‌తో భార్య తలపై మోది హత్య చేసిన భర్త

శ్రీకాకుళం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): అనుమానం పెనుభూతమై భార్యను హత్య చేయించింది. కేవలం ఫోన్‌లో మాట్లాడినందుకే అనుమానించిన ఓ దుర్మర్గుడు భార్యను రాడ్‌తో కొట్టి చంపాడు. తన భార్య నిత్యం ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోందని అనుమానించిన ఆ భర్త చివరికి ఆమెను కడతీర్చిన ఘటన శ్రీకాకుళం నగరంలో శుక్రవారం కలకలం రేపింది. వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం చివరికి భార్య ప్రాణాలు బలితీసుకుంది. శ్రీకాకుళం నగర సవిూపంలో ఖాజీపేటకు చెందిన గొలివి శ్రీలత (32) గుర్తు తెలియని వ్యక్తితో ఫోన్‌లో సంభాషిస్తుండగా అది విన్న ఆమె భర్త శ్యామసుందరరావు ఎవరితో మాట్లాడుతున్నా వంటూ ప్రశ్నించారు. దీంతో కాసేపు వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కోపోద్రికుడై పక్కనే ఉన్న ఇనుపరాడ్డుతో శ్రీలత తలపై బలంగా కొట్టారు. దీంతో ఆమె అక్కడకక్కడే మృతిచెందంది. వీరికి కుమారులు రాజేష్‌, త్రినాధ్‌ ఉన్నారు. శ్యామసుందరరావు అరటిపండ్ల వ్యాపారి. తన భార్యను తానే చంపేశానంటూ శ్యామసుందరరావు రూరల్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

తాజావార్తలు