న్యూఢిల్లీ,అక్టోబర్ 15 (జనంసాక్షి):
అబ్దుల్ కలాంను స్మరించుకోవడమంటే ఎంతో గర్వకారణమని, ఆమర జీవితం జాతికి ఆదర్శమని, మనం చేసుకున్న పుణ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన మూర్తీభవించిన మానవతావాది అన్నారు. రాష్ట్రపతి కాకముందే కలాం జాతిరత్నంగా గుర్తింపు పొందారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 84వ జయంతి సందర్భంగా దిల్లీలోని డీఆర్‌డీవో భవన్‌లో ఏర్పాటు చేసిన కలాం విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ… కలాం లక్ష్య సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. కలాం ఎప్పుడూ అవకాశాల కోసం ఎదురుచూసేవారు కాదు.. సవాళ్లను స్వీకరించేందుకు ఇష్టపడే వారన్నారు. సవాళ్లను ఎలా అధిగమించాలనే అంశంపై కలాం ఎక్కువగా దృష్టి సారించే వారన్నారు. ఆయన ఈ దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఆయన సేవలు నిరుపమానమన్నారు. రామేశ్వరంలో కలాం స్మారక నిర్మాణానికి భూమి సేకరించామని ఈ తెలిపారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… అబ్దుల్ కలాం విద్యార్థులు, యువతకు మార్గదర్శిగా అభివర్ణించారు. ఆయన శాసత్రవేత్తగా ఉంటూనే రాష్ట్రపతిగా ఎదిగిన మహానుభావుడన్నారు. ఆయన పిల్లలకు ఆదర్శ మూర్తి అన్నారు. కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, రవిశంకర్ ప్రసాద్ తదితరులు కలాంకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 84వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఆర్‌డీవో భవన్‌లో అబ్దుల్ కలాంకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అనేకులు నివాళులర్పించారు.





