అమరావతిలో అలజడికి.. 

విజయవాడలో వైసీపీ మాఫియా దిగింది
– రైతులను వైసీపీ రెచ్చగొడుతోంది
– ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
అమరావతి, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : పట్టా భూమి తరహాలో తమకు ప్యాకేజీ ఇవ్వాలని అసైన్డ్‌ భూముల రైతులు అసెంబ్లీ ముట్టడికి సోమవారం సిద్దం కావడంపై ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రంగా స్పందించారు. అమాయక రైతులను రెచ్చగొట్టేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి అమరావతికి పట్టిన దుష్ట గ్రహాలని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ముట్టడి పేరుతో రాజధాని ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు మాఫియా గ్యాంగ్‌ ను వైసీపీ విజయవాడలో దించిందని బుద్ధా వెంకన్న తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ అన్నిరకాలుగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అవినీతిపై జగన్‌, బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
జగన్‌ అనుచరులు ప్రకాశం జిల్లాలోని దొనకొండలో వేల ఎకరాలు దోచుకున్నారని ఆరోపించారు. రాజధాని వస్తుందని అమాయకులైన ప్రకాశం రైతులను జగన్‌ మోసం చేశారన్నారు. వైసీపీకి ప్రజాదరణ రోజురోజుకూ తగ్గిపోతోందని బుద్ధా వెంకన్న తెలిపారు. ఒక జాతీయ ఛానల్‌తో తప్పుడు సర్వేలు నిర్వహించి వైసీపీకి ఆక్సిజన్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ సక్రమంగా సాగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు.

తాజావార్తలు