అమరావతిలో ఆదిశంకరుల విగ్రహం
విశాఖపట్నం,అక్టోబర్23(జనంసాక్షి): ఏపీ రాజధాని అమరావతిలో వంద అడుగుల ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని శారదా పీఠాధిపతి స్వరూపానంద తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని అన్నారు. సోమవారం విశాఖలో స్వరూపానంద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది శంకరాచార్యుల బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. వేద పరిరక్షణకు శారదాపీఠం కృషి చేస్తుందని తెలిపారు. వేదవిద్య విస్తృతి, ధర్మ పరిరక్షణ, ఆలయాల ఆస్తుల రక్షణ, సామాజిక సేవలో శారదాపీఠం ముందుంటుందని స్వరూపానందని వెల్లడించారు. హిందూమతంపై కొందరుపనిగట్టుకుని దాడులకు దిగుతున్నారని అన్నారు. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. నాగుల చవితి, స్వామివారి జన్మదినం సందర్భంగా శారదాపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిజీ జన్మదినం సందర్భంగా పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.