Monday, 2 November 2026

.అమితాబ్‌కు అక్కినేని పురస్కారం

చిత్రపరిశ్రమను ఆదుకుంటాం

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

2
హైదరాబాద్‌: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందజేశారు. అవార్డుతోపాటు అయిదు లక్షల రూపాయల నగదు, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా  కేసీఆర్‌ మాట్లాడుతూ సినీపరిశ్రమకు కావలసినవన్నీ సమకూరుస్తామని చెప్పారు. సినీపరిశ్రమకు సంబంధించి సినీప్రముఖులతో త్వరలో చర్చిస్తానన్నారు. సినీపరిశ్రమ ఇక్కడ నుంచి ఎక్కడికీ తరలిపోదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సినీనటులు నాగార్జున, చిరంజీవి, జయసుధ, సమంత, జమున, నాగచెయతన్య, సుమంత్‌, సుశాంత్‌, అఖిల్‌, ఎంపీలు సుబ్బిరామిరెడ్డి, గల్లా జయదేవ్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్కినేని జాతీయ పురస్కారం అమితాబ్‌ బచ్చన్‌కు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని సినీనటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా పురస్కారం అందుకున్న అమితాబ్‌ బచ్చన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు పరిశ్రమకు 80 సంవత్సరాల చరిత్ర ఉంటే అందులో 70 సంవత్సరాలు ఏఎన్నార్‌కు భాగం ఉందన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే అత్యుత్తమ నటుడైన అమితాబ్‌కు అక్కినేని అవార్డు ఇవ్వడం ఆ పురస్కారానికే వన్నె తెస్తుందన్నారు.

భారత చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు 2005 నుంచి అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ద్వారా అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రస్తుతం టి. సుబ్బరామిరెడ్డి ఈ పౌండేషన్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.  ప్రారంభించినప్పటి నుంచి ఈ అవార్డును అక్కినేని నాగేశ్వరరావు

చేతులవిూదుగానే అందజేశారు.  అక్కినేని మరణానంతరం తొలిసారిగా శనివారం ఈ పురస్కారం అందజేశారు.

అంతకుముందు అమితాబ్‌ సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధించి ముఖ్యమంత్రి అయినందుకు కేసీఆర్‌కు అమితాబ్‌ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి తనవంతు సహాయ, సహకారాలను అందిస్తానన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను బిగ్‌బీకి సీఎం వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *