
హైదరాబాద్,డిసెబర్27(): తెలంగాణలో ఇక ఉద్యోగాలన్నీ కొత్త సిలబస్ మేరకే భర్తీ అవుతాయి. వివిధ గ్రూపుల కింది త్వరలో భర్తీచేసే ఉద్యోగాలకు ఇక కొత్త సిలబస్ తయారైన తరవాతనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త సిలబస్‌లో తెలంగాణ భౌగోళిక నైసర్గిక స్వరూపం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, అభివృద్ధి వంటి అంశాలుంటాయి. ఇవి సంపూర్ణంగా రూపుదిద్దుకున్న తరవాతనే నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అలాగే పూర్తిస్థాయి ఖాళీల వివరాలు ప్రభుత్వం నుంచి వచ్చిన తరవాతనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి చేసిన వ్యాఖ్యలు దీనిని బలపరుస్తున్నాయి. అంతేగాకుండా కమిషన్ ఇంకా పూర్తిస్తాయిలో ఏర్పడలేదని అంటున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్‌సీ) పూర్తి స్థాయిలో ఏర్పాటయ్యే వరకూ ఎలాంటి నోటిఫికేషన్లూ ఉండవని చక్రపాణి తెలిపారు. టీపీఎస్‌సీకి సొంత భవనం లేదని, ప్రస్తుతం ఏపీపీఎస్‌సీ భవనంలోనే నడుస్తోందని ఆయన గుర్తుచేశారు. ‘ఉద్యోగుల విభజన కూడా జరగలేదు. ఏపీపీఎస్‌సీలో 400 మంది ఉద్యోగులుంటే.. వారిలో తెలంగాణ ఉద్యోగులు 120 మందే. ఈ సంఖ్య టీపీఎస్‌సీకి సరిపోదు. మరో 300-350 మంది ఉద్యోగుల అవసరం ఉంది’ అన్నారు. సిలబస్ మారుతోందని, అశోక్‌నగర్‌లోని కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు చెల్లించి మోసపోవద్దని తెలంగాణ విద్యార్థులను హెచ్చరించారు. కోచింగ్ సెంటర్లు చేస్తున్న మోసపూరిత ప్రకటనలతో గందరగోళానికి గురి కావద్దని విద్యార్థులకు సూచించారు. వాటిని నమ్మొద్దని హితవు పలికారు. సిలబస్‌ను రూపొందించడానికి జనవరిలో కమిటీని నియమిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశిస్తే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అయితే ఇప్పటికప్పుడు ఉన్న సిలబస్‌తో కమిషన్ ముందుకు పోయే స్థితిలో లేదని కూడా స్పస్టం అవుతోంది.
పోటీ పరీక్షలకు తెలంగాణలో కొత్త సిలబస్




