తప్పించుకున్న నిత్యానందరెడ్డి
కేబీఆర్ పార్కు వద్ద కలకలం
హైదరాబాద్, నవంబర్ 19 (జనంసాక్షి) : అరబిందో వైస్‌ఛైర్మన్‌పై కాల్పులతో రాజధాని నగరం బుధవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉదయం వేళ నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. అరబిందో ఫార్మసీ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆయనతో పాటు స్థానికులు అప్రమత్తం కావడంతో అగంతకుడు పారిపోయాడు. నిందితుడు ఉపయోగించిన ఏకే 47 గ్రేహౌండ్స్‌కు చెందినది కావడం విశేషం. గతేడాది అది చోరీకి గురైనట్లు విచారణలో తేలింది. నిత్యానందరెడ్డి, ఆయన సోదరుడు ప్రసాద్‌రెడ్డి రోజులాగే బుధవారం ఉదయం కూడా మార్నింగ్ వాక్ కోసం కేబీఆర్ పార్కుకు వచ్చారు. మార్నింగ్ వాక్ పూర్తి చేసుకొన్న అనంతరం ఆయన తమ కారు ఎక్కగా.. వెనుక డోర్ నుంచి ఓ అగంతకుడు కారులోకి ఎక్కారు. రావడంతోనే నిత్యానంద పాయింట్ బ్లాక్ రేంజ్లో ఏకే 47 ఎక్కుపెట్టాడు. మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నామని, తాను చెప్పిన వైపు కారు పోనివ్వాలని.. సహకరించకపోతే కాల్పులు జరుపుతానని హిందీలో హెచ్చరించాడు. వెంటనే అప్రమత్తమైన నిత్యానందరెడ్డి తనకు ఎక్కుపెట్టిన గన్ను పక్కకు నెట్టేశారు. ఆత్మరక్షణ కోసం అగంతకుడి వద్ద ఉన్న గన్ను లాక్కొనేందుకు ప్రయత్నించారు. దీంతో అగంతకుడు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సుమారు పది బుల్లెట్లు అద్దాల్లోంచి దూసుకుపోయాయి. కాల్పుల మోత విని అక్కడ చేరుకున్న ప్రసాద్‌రెడ్డి వెనక వైపు నించి అగంతకుడ్ని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. మరోవైపు, స్థానికులు కూడా కారు వద్దకు పరుగెత్తుకొచ్చారు. దీంతో దుండగుడు ఆయన చేయి కొరికి అక్కడి నుంచి పరారయ్యాడు. ఏకే 47తో పాటు బ్యాగ్ అక్కడే పడేసి సవిూపంలోని ఓ అపార్ట్మెంట్ వైపు పరుగెత్తినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయం పూట, నగరం నడిబొడ్డున వీఐపీలు తిరిగే ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకోవడం కలకలం రేపింది. సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సవిూక్షించారు. నిందితుడు కారులో వదిలేసిన ఏకే 47ను స్వాధీనం చేసుకున్నారు. కారు ముందు వెనుకభాగంలో బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. అలాగే సవిూపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్, ఫింగర్‌ప్రింట్స్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. అగంతకుడు డబ్బు కోసం కిడ్నాప్‌కు యత్నించాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
గ్రేహౌండ్స్‌కు చెందిన ఏకే 47
నిత్యానందరెడ్డిపై దాడి వ్యవహారంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. నిందితుడు కిడ్నాప్ కోసం ఉపయోగించిన ఏకే 47 గన్ గ్రేహౌండ్స్‌కు చెందినది కావడం విశేషం. ఆగంతకుడు కాల్పులు జరిపిన ఆయుధం గత ఏడాదికి చోరీకి గురైనట్లు తేలింది. దుండగుడు ఉపయోగించిన ఏకే 47 ఏడాది క్రితం గ్రేహైండ్స్ పోలీసుల నుంచి చోరీకి గురైనట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. గతేడాది డిసెంబర్లో గ్రేహౌండ్స్‌లో ఏకే 47 అదృశ్యమైనట్ల నార్సింగ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైందని ఆయన చెప్పారు. ఘటనా స్థలంలో ఎనిమిది బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితుడు పక్కా ప్రణాళికతోనే దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నామన్నారు. కాల్పుల వ్యవహారంలో నక్సల్స్ పాత్ర ఏమైనా ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కాల్పుల ఘటనకు సంబంధించి కీలక సాక్ష్యాధారాలు దొరికాయని, వీలైనంత త్వరగా పురోగతి సాధిస్తామని చెప్పారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం కిడ్నాపర్ ఒక్కరేనని వివరించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు బయటకు వస్తాయన్నారు.
ఎవరితో శత్రుత్వం లేదు: నిత్యానంద
తనపై కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరో తెలియదని నిత్యానందరెడ్డి తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం పోలీసులను ఆయనను విచారించారు. నిందితుడు ఎలా వచ్చాడు, కాల్పులు ఎలా జరిపాడనే దానిపై ఆరా తీశారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. 32 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సున్న వ్యక్తి అకస్మాత్తుగా కారులోకి వచ్చాడని తెలిపారు. నుదుట తుపాకీ పెట్టి బెదిరించాడని చెప్పారు. డబ్బు కావాలంటే ఇస్తానని తాను చెప్పినా వినలేదన్నారు. ఆత్మరక్షణ కోసం అతడితో పెనుగులాడానని, దీంతో నిందితుడు కాల్పులు జరిపాడని చెప్పారు. తనకు ఎవరితోనూ గొడవలు, మనస్పర్థలు లేవని తెలిపారు. నిందితుడ్ని చూస్తే తాను గుర్తు పడతానని చెప్పారు.
పరామర్శించిన జగన్ : కాల్పుల దాడి జరిగిన నిత్యానందరెడ్డిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. బుధవారం ఉదయం ఆయనకు ఫోన్ చేసిన జరిగిన దాడి గురించి ఆరా తీశారు. జగన్ అక్రమాస్తుల కేసులో నిత్యానందరెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. అరబిందో ఫార్మాకు వైఎస్ సర్కారు లబ్దిచేకూర్చినందుకు గాను ఆ సంస్థ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందనే అభియోగాలున్నాయి.
కాల్పుల ఘటన దురదృష్టకరం: కేసీఆర్
కేబీఆర్ పార్కు వద్ద కాల్పుల ఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని చెప్పారు. కాల్పుల ఘటనపై శాసనసభలో ప్రకటన చేయాలని ప్రతిపక్షం కోరడంతో.. ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేశారు. ‘మార్నింగ్ వాక్‌లో భాగంగా అరబిందో వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి పార్కకు వెళ్లారు. ఉదయం 7.15 గంటలకు తిరిగివస్తూ.. ఆయన తన కారు ఎక్కారు. అదే సమయంలో మరో డోర్ నుంచి ఏకే 47 తుపాకీతో అగంతకుడు కారులోకి ప్రవేశించాడు. తుపాకీతో బెదిరించి డబ్బు డిమాండ్ చేశారు. నిత్యానందరెడ్డి అగంతకుడ్ని ప్రతిఘటించాడు. తుపాకీని చేత్తో పక్కకు నెట్టేశాడు. ఆ సమయంలో పెనుగులాట జరిగింది. ఏకే 47 పేలి కారు ముందు అద్దం నుంచి బుల్లెట్లు దూసుకుపోయాయి. దీన్ని గమనించిన నిత్యానందరెడ్డి సోదరుడు అగంతకుడ్ని పట్టుకోవడానికి యత్నించాడు. దీంతో నిందితుడు అతడి చేతిని కొరికి పారిపోయాడు. కాల్పుల ఘటనపై 307, 363 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు వాడిన ఏకే 47 గ్రేహౌండ్స్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. గతేడాది డిసెంబర్ 26న దాన్ని దొంగిలించినట్లు నార్సింగ్ ఠాణాలో కేసు కూడా నమోదైంది. కేసు ఛేదించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని’ తెలిపారు.
ఙ





