Tuesday, 3 November 2026

అవకాశమివ్వడి.. అభివృద్ధి చేస్తాం

C copy

– గ్రేటర్‌ ప్రచారంలో కేటీఆర్‌

హైదరాబాద్‌,జనవరి24(జనంసాక్షి): ఒక్కసారి అవకాశమిస్తే అన్ని రంగాల్లో హైదరాబాద్‌ను ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని కల్లకుంట్ల తారకరామారావు తెలిపారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గులాబీ పార్టీ నేతలు దూసుకుపోతున్నారు. ఎన్నికల గెలుపు కోసం పార్టీలోని ప్రతినాయకుడు వాడవాడలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తోన్నారు. ఈమేరకు ఇవాళ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అయ్యప్ప సొసైటీ, వివేకానందనగర్‌లో రోడ్‌ షో నిర్వహించారు. కేటీఆర్‌ రోడ్‌ షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. గులాబీ దళానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఒక్కసారి హైదరాబాద్‌ మేయర్‌ పీఠం తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేయించి చూపిస్తామన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, మజ్లిస్‌ పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసినా మురిగిపోయినట్టేనని తెలిపారు. అందుకే తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గతంలో ఈ పార్టీలన్ని మేయర్‌ సీటును ఎక్కి హైదరాబాద్‌ను గబ్బు పట్టించాయన్నారు. అందుకే ఈసారి తమకు అధికారం అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. 60 ఏళ్లు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలిన మహానుభావులు ఇవాళ అభివృద్ధి జరగలేదని మాపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 60 ఏళ్ల గబ్బు 18 నెలల్లో పోతుందా? అని అన్నారు. కొత్త సంసారం ఎట్లుందో తెలుసుకుందామని సీఎం కేసీఆర్‌ సకల జనుల సర్వే చేయిస్తే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయని మండిపడ్డారు. సర్వే ద్వారా సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. ఇంటింటికి మంచినీటిని అందిస్తామని హావిూ ఇచ్చారు. ఆసరా పథకం కింద వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు పెన్షన్‌ అందిస్తున్నామన్నారు. నగరంలో ప్రతీ పేదవాడికి సొంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ఈ ఏడాది పది వేలు, వచ్చే యేడాది 25 వేలు, ఆ మరుసటి ఏడాది 50 వేలు ఇలా దఫాలవారీగా కట్టించి ఇస్తామని హావిూ ఇచ్చారు. ప్రతీ పేద ఇంటికి రూ.1కి కిలో బియ్యం చొప్పున ఒక్కొక్కరికి 6 కిలోల పంపిణీ చేస్తున్నామన్నారు. పెళ్లీడు ఆడ పిల్లలకు మతం, కులంతో ప్రమేయం లేకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం కింద రూ.51 వేలు ఆర్థికసాయం అందజేస్తున్నామన్నారు.  గ్రేటర్‌లో గులాబీ కారు స్పీడ్‌ పెంచింది. మేయర్‌ పీఠం ఎక్కెందుకు గులాబీ దళం కసరత్తు తీవ్రం చేసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిపించుకునేందుకు ఆ పార్టీ నేతలు అహర్నిశలు కృషి చేస్తోన్నారు. ఈమేరకు ఇవాళ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్‌ షోల పేరిట సుడిగాలి పర్యటన చేస్తోన్నారు. టీఆర్‌ఎస్‌పార్టీ కారు గుర్తుకు ఓటు వేసేలా ఓటర్లను సమాయత్తం చేస్తోన్నారు. నగరంలోని మాదాపూర్‌, అయ్యప్ప సొసైటీ, వివేకానంద నగర్‌, మూసాపేట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, బాలానగర్‌లో రోడ్‌ షోలో పాల్గొన్నారు. బాలానగర్‌ రోడ్‌ షోలో మాట్లాడుతూ.. మన హైదరాబాద్‌ నగరాభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలకు ఓటు వేస్తే వచ్చేదేవిూలేదని, రాలేది బూడిదేనని ఎద్దేవా చేశారు. మన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను గెలిపించుకుంటే వాళ్లు రేపు సీఎం కేసీఆర్‌ ముందు కూర్చుని అన్నా ఈ పని చేయి అని బరాబర్‌ చేయించుకుంటారని తెలిపారు. అందుకే కాంగ్రెస్‌, టీడీపీలకు ఓటు వేస్తే ఓటును మురుగపెట్టుకున్నట్లే నని పేర్కొన్నారు. మూడేళ్లలో ఇంటింటికి మంచినీటిని ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని ప్రకటించిన దమ్మున్న సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నరని ఎంపీ కవిత అన్నారు. ఇవాళ షేక్‌పేట్‌లో ఆమె పార్టీ అభ్యర్థులతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల పట్టాలన్నీ ఆడబిడ్డల పేరు విూదనే ఇస్తున్నమని అన్నారు. హైదరాబాద్‌లో చెరువులన్నీ కబ్జాలకు గురైనవని.. వాటిని రూ.4వేల కోట్లతో బాగు చేస్తమన్నారు. వచ్చే నాలుగేళ్లలో నగరంలో లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లను కట్టిస్తమని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *