Tuesday, 3 November 2026

ఆగివున్న లారీని ఢీకొన్న బైకు

ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
కడప,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): కడప జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.  ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన కడపజిల్లా దువ్వూరు మండలం ఏకోపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.  కర్నూలు పట్టణానికి చెందిన ప్రవీణ్‌(22), నవీరసూల్‌(23) తిరుపతిలోని ఎదలవాడ రమణమ్మ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. బుధవారం పరీక్షలు పూర్తవడంతో.. శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుంచి ద్విచక్రవాహనం పై సొంతూరుకు బయలుదేరారు. బైక్‌ ఏకోపల్లి వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బైక్‌ నడుపుతున్న ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. రసూల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రసూల్‌ కూడా మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *