హైదరాబాద్: ఆడవారిని రక్షించడమే రక్షాబంధన్ ప్రత్యేకత అని కేంద్ర కార్మికశాఖామంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మహిళల రక్షణకోసం కేంద్రప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. గురువారం హైదర్‌గూడలోని ఓల్డ్‌ఎమ్మెల్యేక్వాటర్స్‌లోని బీజేపీ నగర కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు రాధిక ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు మహిళలు బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, శాసనసభనేత జి. కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ నేత జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సోదరభావాన్ని పెంపొందించటంలో రక్షాబంధన్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళామోర్చా రాష్ట్ర నాయకురాలు అరుణజ్యోతి, బీజేపీ నేతలు వెంకటరమణి, రాజశేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఖైరతాబాద్‌లో తొలి రాఖీ గణనాథుడికే…రక్షాబంధన్ సందర్భంగా ఖైరతాబాద్ వాసులు తొలి రాఖీని భారీ గణనాథుడికి కట్టి పండుగను జరుపుకొన్నారు. గురువారం ఉదయం భారీ గణపతి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన భారీ రాఖీని ఆయనకు కట్టి మరో చేతికి భక్తులు తయారు చేయించిన వెండి కడియాన్ని తొడిగించారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కార్యదర్శి రాజ్‌కుమార్, స్థానికులు ఇందులో పాల్గొన్నారు. భారీ గణపతి విగ్రహ తయారీ పనులు 70 శాతం పూర్తయ్యాయి. మరో ఐదు రోజుల్లో పీఓపీ పనులు పూర్తి చేసుకొని గణపతికి రంగులు అద్దే పనులు ప్రారంభిస్తామని శిల్పి రాజేంద్రన్ తెలిపారు. ప్రస్తుతం గణపతితోపాటు దేవతా మూర్తులకు ఆభరణలు తయారు చేసి అమర్చే పనులు చురుకుగా సాగుతున్నాయి.
ఆడవారిని రక్షించడమే రక్షాబంధన్ ప్రత్యేకత




