Monday, 2 November 2026

ఆదిలాబాద్ జిల్లాలో పుష్కరాలపై ఇంద్రకిరణ్ సమీక్ష..

ఆదిలాబాద్ : జిల్లాలో గోదావరి పుష్కర పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పుష్కరాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 70 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పుష్కరాలు సమీపిస్తున్నా.. అధికారులు మాత్రం స్పందించడం లేదు. మరోవైపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 15 మండలాల్లో 40 పుష్కరఘాట్‌లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సరస్వతీ పుణ్యక్షేత్రమైన బాసరలో భక్తులకు పుష్కరస్నానాలు చేయడానికి ఘాట్లను ఏర్పాటు చేశారు. ఒక్క బాసరలోనే దాదాపు 800 మొబైల‌్‌ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. పుష్కరాలకు ఈసారి పక్కరాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో… వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ఐదు జిల్లాల్లో పుష్కర పనులకు 600 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని.. గతంలో 27 పుష్కర ఘాట్లు ఉంటే ఇప్పుడు 106 ఘాట్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
పుష్కరాలకు బస్సులు..స్పెషల్ రైళ్లు..
పుష్కరాలకు ప్రత్యేకంగా 2300 బస్సులు, 84 స్పెషల్‌ రైళ్లను, రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేశామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు 18 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పలు శాఖలకు నిధులు..
ఇరిగేషన్‌శాఖకు 105 కోట్ల 39 లక్షలు, ఆర్‌ అండ్‌ బీ శాఖకు 250 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 75 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు 35 కోట్లు, దేవాదాయశాఖకు 21 కోట్లు, పోలీసు శాఖకు 25 కోట్లు, ఎలక్ట్రిసిటీ శాఖకు 12 కోట్లు, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కు రెండున్నర కోట్లు, గజ ఈతగాళ్లకోసం రెండున్నర కోట్లు, అగ్నిమాపక శాఖకు 2 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అత్యవసర ఖర్చుల నిమిత్తం ఐదు జిల్లాల కలెక్టర్లకు రెండున్నరకోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతిక శాఖకు కోటి రూపాయలు, ప్రచారానికి 6 కోట్లు కేటాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *