జల్, జమీన్, జంగల్ మాజెండా
బంజారా, ఆదివాసీ భవన్‌లకు సీఎం కేసీఆర్ శంఖుస్థాపన
హైదరాబాద్,డిసెంబర్11(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దే తమ ఎజెండానని జల్, జమీన్, జంగల్ నినాదం తమ జెండాననీ సీఎం కేసీఆర్ అన్నారు. దళితులు,గిరిజనులు,ఆదివాసీలు సంతోషంగా ఉన్నప్పుడే తెలంగాణకు సార్ధకత చేకూరుతుందని ఆయన అన్నారు. గురువారం బంజారాహిల్స్ లో ప్రభుత్వం నిర్మించే దళిత, బంజారా భవన్‌ల నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ…. ఆదిలాబాద్ జిల్లాలోని గోండుగూడెం నుంచి జల్ జవిూన్ జంగిల్ నినాదం ప్రారంభమై… దశాబ్దాలుగా పోరాటం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సమ న్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. బంజారా భవన్ నిర్మాణానికి ఎకరం భూమి సహా రూ.2.5 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అవసరమైతే మరి కొన్ని నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం తర్వాత గిరిజనులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు. .ఉద్యమ సమయంలో తాను ఇచ్చిన మాట మేరకు బంజారాహిల్స్‌లో బంజారా, ఆదివాసీ భవనాలు కట్టిస్తున్నానని కేసీఆర్ అన్నారు. . మా తండాలో మా రాజ్యం కావాలని దశాబ్దాలుగా గిరిజనులు కోరుతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. జల్, జంగల్, జవిూన్ నినాదంతో గోండులు పోరాడారని అన్నారు. గిరిజన ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంత్రి ఉత్సవాలకు జిల్లాకు పది లక్షల చొప్పున రూ. 90 లక్షలు కేటాయిస్తామని కేసీఆర్ హామి ఇచ్చారు. ఏ గిరిజన బిడ్డ పెళ్లి జరిగినా రూ. 51 వేలు ఇస్తామన్నారు. గిరిజన ఆదివాసుల్లో బాల్య వివాహాలు బంద్ చేయాలని సీఎం పిలుపునిచ్చారు. మూడనమ్మకాలకు స్వస్తి చెప్పాలన్నారు. సమైక్య రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగిందిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. దశాబ్దాల తరబడి పోరాడిన ఆదివాసీలు, యావత్ గిరిజన జాతికి కేసీఆర్ అభినందనలు తెలిపారు. గిరిజనులకు కూడా భూ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. గిరిజనులకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామని హావిూనిచ్చారు. అంతేకాకుండా వారికి మొదటి సంవత్సరానికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసేందుకు ఆదేశాలిచ్చినమని.. త్వరలోనే అమలు చేయబోతున్నమని పేర్కొన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తమంటే కొందరు లేనిపోని అపోహలు స్‌ఋష్టిస్తున్నారని మండిపడ్డారు. అందరికీ సమానమైన హక్కులు కల్పించడానికే తెలంగాణ ప్రత్యేక రాష్టాన్న్రి సాధించుకున్నమని తెలిపారు. గిరిజన మేధావులు సమస్యలు, అభివృద్ధిపై చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పుడే బంజారా భవన్, ఆదివాసీ భవన్‌లకు సార్థకత చేకూరుతుందని తెలిపారు. తండాలు, గొండు గూడెంలలో అంటువ్యాధులతో చనిపోతున్నారు. హైదరాబాద్‌లోని చాలా మంది వైద్యులతో దీనిపై మాట్లాడానని, 500 మంది వైద్యులతో తండాలలో అవగాహన కల్పిస్తామని సీఎం చెప్పారు. నాటుసారా, కల్తీసారా విధానం రూపుమాపాలన్నారు.. ఆదిలాబాద్ అంటురోగాలు కూడా మాయం కావాలని అభిలాషించారు. ఉట్నూరులో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి కడితే రోగాలు నయం కావన్నారు. సరైన తిండి తినాలి, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు ఇతరులకు మళ్లించబడవని, గిరిజనుల కోసమే ఖర్చు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే గిరిజన విభాగానికి గిరిజన మంత్రి నియమిస్తామని పేర్కొన్నారు. ప్రజల కోసమే ప్రభుత్వాలు పని చేయాలని కేసీఆర్ అన్నారు. అవసరమైనప్పుడు హక్కుల కోసం పిడికిలి బిగించాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో 60 ఏండ్లు అప్లికేషన్లు పట్టుకుని ఆఫీసుల వెంట తిరిగినా ఒక్క సెంటు భూమి కేటాయించలేదు. కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లో బంజారా, ఆదివాసి భవన్లను కేటాయించి నందుకు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ఎంపీ చెప్పారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసీలకు అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. తండాల, గూడెంలను గ్రామపంచాయితీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. గిరిజన, ఆదివాసీలకు కళ్యాణ లక్ష్మీ పథకం వరం లాంటిదని చెప్పారు. ఈ కార్యక్రమానికి పది జిల్లాల నుంచి గిరిజనులు భారీగా హాజరయ్యారు.గిరిజనులవేషధారణ,సంప్రదాయ నృత్యాలతో బంజారాహిల్స్ రోడ్ నెం 10లో పండగ వాతావరణం నెలకొంది.





