Tuesday, 3 November 2026

ఆధార్‌కు చట్టబద్ధత

C

– లోక్‌సభలో బిల్లుకు ఆమోదం

– గోప్యత కాపాడుతాం

– అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ,మార్చి11(జనంసాక్షి): ఆధార్‌ నంబర్‌ ఇక భారత్‌లో చట్టబద్దమైన ఓ గుర్తింపు కార్డుగా చరిత్ర కెక్కింది. అన్నింటికీ ఆధార్‌ నంబర్‌ ఆధారమే కావడంతో దీనికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ద్రవ్య బిల్లు రూపంలో ఆధార్‌ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆధార్‌ అనుసంధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇచ్చారు. దేశంలో 97 శాతం మంది ప్రజలకు ఆధార్‌ ఉందన్నారు. ఆధార్‌ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. రోజూ 5 నుంచి 7 లక్షల మంది ఆధార్‌ నమోదు చేసుకుంటున్నారని చెప్పారు. ఆధార్‌ ద్వారా నమోదైన బయోమెట్రిక్‌ సమాచారం ఎవరితోనూ పంచుకోమని పేర్కొన్నారు. ఆధార్‌కు చట్టబద్ధతతో తొలి ఏడాది రూ. 15 వేల కోట్ల సబ్సిడీ ఆదా అవుతుందని ప్రకటించారు. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, పుదుచ్చేరిలో పీడీఎస్‌కు ఆధార్‌ అనుసంధానంతో రూ. 2 వేల 300 కోట్లు ఆదా అయిందని వివరించారు. గతంలో ఓటుకు ఆధార్‌ నమోదు చేయడంతో సుప్రీం అభ్యంతరం తెలిపింది. దీంతో ఇప్పుడు అలాంటి అడ్డంకులు ఉండబోవని భావిస్తున్నారు.  దీంతో ఇకపై కేంద్ర ప్రభుత్వ రాయితీలన్నీ ఆధార్‌ అనుసంధానం ద్వారానే లబ్ధిదారులకు అందించనున్నాయి. పౌరసత్వ, స్థానిక హక్కులు మాత్రం ఆధార్‌తో ముడిపడి ఉండవని గతంలోనే జైట్లీ స్పష్టంచేశారు. ప్రత్యక్ష నగదు బదిలీ విషయంలో ఎల్పీజీ రాయితీ(డీబీటీఎల్‌)ని అందించే పహల్‌ పథకానికి ఇప్పటికే ఆధార్‌ను అనుసంధానం చేశారు. ఎరువుల రాయితీని ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రైతులకు అందించేందుకు, చౌక దుకాణాలను ఆటోమేషన్‌ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.వాస్తవానికి కేంద్ర పథకాల నుంచి లబ్ధి పొందాలంటే ఆధార్‌ తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం గతంలోనే యత్నించింది. అయితే ఆధార్‌ చట్టబద్ధత, గోప్యతపై సుప్రీంకోర్టు సంశయాలు లేవనెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఆధార్‌కు శాసన ¬దా కల్పిస్తూ పార్లమెంటులో బిల్లును ఆమోదించి ప్రభుత్వం దానిని చట్టబద్ధం చేసింది. 2016 ఫిబ్రవరి 29 నాటికి మొత్తం దేశ జనాభా 131.71 కోట్లు, జారీ అయిన ఆధార్‌ కార్డులు 98కోట్లు, మొత్తం డీబీటీఎల్‌ ఖాతాలు 16.5కోట్లు, ఆధార్‌తో అనుసంధానమైనవి 11.19కోట్లు. ఎన్టీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆధార్‌ బిల్లును లోక్‌ సభ ముజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య వాదోపవాదనలు జరిగాయి. దీన్ని ఆర్థిక బిల్లు మాదిరిగా ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే పౌరుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడటమే ఆధార్‌ బిల్లు ముఖ్య ఉద్దేశమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సభకు వివరించారు. పౌరుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు.  బిల్లు ప్రకారం భారత్‌లో 182 రోజులకు పైగా నివసించిన వ్యక్తులెవరైనా ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థిక బిల్లు మాదిరిగా ప్రవేశపెట్టడంతో రాజ్యసభలో దీనిపై కేవలం చర్చ మాత్రమే జరుగుతుంది. ఎలాంటి సవరణలకు వీలుండదు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన 14 రోజుల్లో ఎలాంటి చర్చ జరగకపోతే బిల్లు ఆమోదం పొందినట్లే. ఈనేపథ్యంలో ఆధార్‌ బిల్లును ఆర్థిక బిల్లు మాదిరిగా లోక్‌ సభలో ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతోంది. రాజ్యసభలో తగిన బలం లేని అధికార బీజేపీ దొడ్డి దారిన బిల్లుల ఆమోదానికి ప్రయత్నిస్తోందని ఆ పార్టీ విమర్శించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *