హైదరాబాద్ సిటీ : ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండికొడుతున్న నకిలీ బస్‌పాసులు, టికెట్ లేని ప్రయాణాలపై కొరడా ఝుళిపించేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు 3800 బస్సులు 42 వేల ట్రిప్పులు 10 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. రోజు 33 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నా ఆక్యుపెన్సీ రేషియో మాత్రం పెరగడం లేదు. గ్రేటర్ అధికారులు రెవెన్యూ పెంచేందుకు దృష్టిసారించారు. నగరంలో ఆర్టీసీ రోజుకు 30 లక్షలకు పైగా నష్టాలు మూటగట్టుకుంటోంది. రద్దీ రూట్లలో ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లుగా బస్సుల సంఖ్యను పెంచడం, బస్సుల సమయపాలన సరిగా అమలయ్యేలా బస్‌బేల వద్ద అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.స్పెషల్ చెకింగ్స్…
నగరంలో రద్దీ రూట్లలో నిత్యం బస్సుల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉన్నా అనుకున్న స్థాయిలో టికెట్ కలెక్షన్స్ పెరగడం లేదు. పలు ప్రాంతాల్లో బస్టాపులు దగ్గర దగ్గరగా ఉండటంతో కొంతమంది టికెట్ తీసుకునేలోపే బస్సు ముందు స్టాప్‌కు చేరడంతో టికెట్ తీసుకోకుండానే దిగిపోతున్నారు. గతంలో ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా టికెట్ చెకింగ్స్ నిర్వహించేవారు. ఇప్పుడు అన్ని రూట్లలో 135 మంది అధికారులతో ప్రత్యేక టీమ్‌లుగా విడిపోయి టికెట్ చెక్సింగ్ నిర్వహిస్తున్నారు. స్క్వాడ్ వ్యవస్థలోని అధికారులు నామమాత్రంగా కాకుండా ప్రతిరోజు ప్రాంతాల వారీగా చెకింగ్స్ నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నకిలీ బస్‌పాసుదారులపై కఠిన చర్యలు…
బస్సుల్లో టికెట్ తీసుకోకుండా ప్రయాణించేవారిపై అపరాధ రుసుం (ఫైన్) రూ.500 వరకు విధిస్తారు. నిత్యం టికెట్ లేకుండా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని గుర్తించి వారిపై కఠిన చర్యలు ఆమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యాసంస్థల పేరుతో నకిలీ బస్‌పాస్‌లు ఉపయోగిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైతే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు




