– జన్‌ధన్‌వల్ల ప్రజలకు మేలు
– ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,నవంబర్6(జనంసాక్షి):
దేశంలో చేపట్టే సంస్కరణల వల్ల పేదలకు మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మార్పు అనేది ఒక మారథాన్ లాంటిదని, అది వేగవంతమైన పరుగుకాదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆర్థికాభివృద్ధికి చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఢిల్లీ ఎకనామిక్ కాంక్లేవ్ 6వ వార్షిక సదస్సు శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మోదీ మాట్లాడుతూ జన్‌ధన్ యోజనవల్ల పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరిందని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. 19 కోట్ల మందిని తీసుకురాగలిగామని ఆయన అన్నారు. ప్రయాణం సుదూరం… సంస్కరణలు మార్గమధ్యంలో స్టేషన్ లాంటివని… సంస్కరణ అనేది రూపాంతరం చెందడం లాంటిదని ఆయన పేర్కొన్నారు. రూపాంతరానికి సంస్కరణ అనేది మారథాన్ లాంటిదని, అది వేగవంతమైన పరుగులాంటిది కాదని మోదీ వ్యాఖ్యానించారు. ఆర్థిక, వ్యవస్థపరమైన అంశాలను నేను ప్రస్తావించగలనని, ఇక్కడే అన్ని విషయాలు చెప్పలేనని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంస్కరణలు మాత్రం సక్రమ మార్గంలోనే నడుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్థూల జాతీయోత్పత్తి పెరుగుతోందని, ద్రవ్యోల్భనం తగ్గుముఖం పడుతోందని, కరెంట్ ఎకౌంట్ లోటు తగ్గుతోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జనధన్ విజన్ లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. జీడీపీలో వృద్ధి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందన్నారు. జనధన్ యోజన కింద మొత్తం రూ.26వేల కోట్లు జమ అయ్యాయని తెలిపారు. 17నెలల తమ పాలనలో 190 మిలియన్ మందిని బ్యాంకింగ్ రంగానికి పరిచయం చేశామన్నారు. భారత్‌లో వ్యాపార సామర్ధ్యం వేగంగా విస్తరిస్తోందన్నారు. వ్యాపార విస్తరణ వల్ల ఉద్యోగాలు వెతికే స్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరతామన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే దేశంలో ఆర్థికస్థితి మెరుగ్గా ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. భారత్‌లో వ్యాపార సామర్థ్యం విస్తరించిందన్నారు.ఈ ఏడాది జీడీపీ వృద్ది రేటు అశాజనకంగా ఉందన్నారు. ద్రవ్యలోటు తగ్గిందన్న ప్రధాని రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలావుంటే భారత్‌లో పెట్టుబడులు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఆర్థిక అంశాలపై సవిూక్షకు, విధాన నిర్ణయాలు చర్చించుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ పబ్లిక్ రంగంలో పెట్టుబడులు కూడా పెంచుతున్నట్లు వెల్లడించారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ముందుంటుందని ఆయన అన్నారు. ప్రైవేట్ పెట్టుబడులు మందగించాయని, ఆ విషయం మాకు తెలుసునని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని అరుణ్ జైట్లీ అన్నారు. ప్రభుత్వ పెట్టుబడులు కూడా బాగానే పెరిగాయని ఆయన అన్నారు. ప్రైవేటు రంగ పెట్టుబడులు వేగం పుంజుకునేవరకు పబ్లిక్ రంగ పెట్టుబడులు దారి చూపించాలని జైట్లీ చెప్పారు.





