ద డ్రమాటిక్ డికేడ్లో అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న రాష్ట్రపతి
దిల్లీ డిసెంబర్12(జనంసాక్షి): దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తనను మందలించిన సందర్భాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అలనాటి జ్ఞాపకాలను తన పుస్తకంలో నెమరువేసుకున్నారు. ఇందిరాగాంధీ తనపై చాలా విశ్వాసం చూపేవారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకం ‘ద డ్రమాటిక్ డికేడ్: ద ఇందిరాగాంధీ ఇయర్స్’లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఉదంతాలను ఆయన అందులో విపులంగా వివరించారు. ఇందిరాగాంధీ సలహాను పట్టించుకోకుండా తాను 1980 ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోవటం.. ఆమె తనను తీవ్రంగా మందలించటం.. కేబినెట్లోకి చేర్చుకోవటం.. రాజ్యసభ నేతగా అవకాశమివ్వటం వంటి ఘటనలను నెమరేసుకున్నారు. 1980 లోక్‌సభ ఎన్నికల తరుణంలో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయటంలో నిమగ్నమయ్యాయని ప్రణబ్ తెలిపారు. ‘ప్రభుత్వాన్ని నడపగల వారిని కూడా ఎంపికచేయండి’ అని ఇందిరాగాంధీ తనకు అప్పుడే చెప్పారని.. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆమె చాలా ధీమాతో ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ”నిజానికి ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆమె నాకు గట్టిగా చెప్పారు. కానీ నేను పట్టుబట్టటంతో అంగీకరించారు. బోల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి 68,629 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఇది నన్ను బాగా కుంగదీసింది. ఫలితాలు వెలువడగానే నా భార్య దిల్లీకి వెళ్లిపోయింది. అదే రోజు ఆమె నాకు ఫోన్ చేసి ఇందిర నన్ను కలవాలని అనుకుంటున్నారని, వెంటనే రమ్మని చెప్పింది” అని ప్రణబ్ పేర్కొన్నారు. దిల్లీకి చేరుకోగానే ఇందిరను కలవటానికి తాను నేరుగా విల్లింగ్డన్ క్రిసెంట్‌కు వెళ్లానన్నారు. ‘మీరు ఓడిపోయారని తెలిసినప్పట్నుంచీ అమ్మ అసంతృప్తితో ఉన్నారు’ అని సంజయ్‌గాంధీ తనకు చెప్పారని.. ఆమెను తాను కలిసినప్పుడు కూడా అలాగే కనిపించారని ప్రణబ్ వివరించారు. ”అప్పుడు రాత్రి 9 గంటలైంది. డైనింగ్ టేబుల్‌కు అటు చివర ఆమె కూచున్నారు. మరో చివరన నేను నిలబడ్డాను. చాలా సేపు ఆమె నన్ను గట్టిగా కేకలేస్తూ మందలించారు. ఆమె సలహాను పట్టించుకోకుండా ఎన్నికల్లో పోటీచేసినందుకు చివాట్లు పెట్టారు. ఇలాంటి అవివేక నిర్ణయాలతో అంతకుముందు పడ్డ శ్రమంతా నిష్ఫలమవుతుందని ఆమె నాకు చెప్పారు. ఆమె శాంతించేవరకు అక్కడే నిలబడ్డాను. తర్వాత చేతికి పళ్లబుట్ట ఇచ్చి ఇంటికి పంపించారు” అని ఇందిరాగాంధీ తనపై ప్రదర్శించిన కోపాన్ని, ప్రేమను గుర్తుచేసుకున్నారు. మంత్రివర్గంలో చేర్చుకోకపోవటంపై తాను కినుక వహించినట్టు కొందరు సంజయ్‌గాంధీకి చెప్పారని ప్రణబ్ పేర్కొన్నారు. అయితే తన గురించి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఓడిపోయిన తర్వాత మంత్రివర్గంలో చేరటం గురించి అసలే ఆలోచించలేదని తాను సంజయ్‌గాంధీకి వివరించానని తెలిపారు. దీనికి సంజయ్ స్పందిస్తూ.. తనను కేబినెట్లో చేర్చుకోవాలని ఇప్పటికే నిర్ణయించామని, అయితే మొదటి విడతలోనా? మలి విడతలోనా? అనేది తెలియదని చెప్పారన్నారు. దీనిపై ఇందిరతో మాట్లాడాలని సూచించారని, కానీ అది సమంజసం కాదన్నానని వివరించారు. ”మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగే రోజు ఉదయం 9.30 గంటలకు ఇందిరాగాంధీ సహాయకుడు ఆర్.కె.ధావన్ నాకు ఫోన్ చేశారు. 11 గంటల వరకు రాష్ట్రపతి భవన్లో ఉండాలని చెప్పారు. కేబినెట్ సెక్రెటరీ నుంచి పిలుపు కోసం వేచి ఉండొద్దన్నారు. నేను రాష్ట్రపతి భవన్‌కు వెళ్లాను. అశోకాహాల్కు చేరుకున్నాక చూస్తే ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల వరుసలో కూచోవటానికి నాకు కుర్చీ లేదు. నేను ఇందిర వైపు చూశాను. ఏదో లోటున్నట్టు ఆమె వెంటనే గ్రహించారు. తర్వాత ధావన్ నా దగ్గరకు వచ్చి, వేచి ఉండమని చెప్పారు. ఆయన కేబినెట్ సెక్రటరీ వద్దకు వెళ్లారు. తర్వాత రాష్ట్రపతి సెక్రటరీని సంప్రదించారు. ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల జాబితాలో నా పేరు చేత్తో రాసి ఉంది. టైపు చేసి లేదు. అందువల్లే తనకు కుర్చీని కేటాయించలేదని తెలిసింది. వెంటనే ఇందిరాగాంధీ చేత్తో మరో ఉత్తరాన్ని రాసి, రాష్ట్రపతి సెక్రటరీకి పంపించారు. పి.వి.నరసింహారావు, ఆర్.వెంకట్రామన్ మధ్యలో నాకు చోటిచ్చారు. ముందు ఇందిరాగాంధీ, తర్వాత కమలాపతి త్రిపాఠీ ప్రమాణం చేశారు. తర్వాత అక్షర క్రమంలో అందరినీ పిలిచారు. అయితే అదృష్టసంఖ్య మేరకు మంత్రివర్గంలో 22 మంది ఉండాలని ఇందిరాగాంధీ భావించారని.. భగవత్ ఝా ఆజాద్ ప్రమాణ స్వీకారం చేయటానికి నిరాకరించటంతో ప్రణబ్ ముఖర్జీ పేరును చివరి నిమిషంలో చేర్చాని చండీగఢ్ నుంచి వెలువడే ఒక పత్రిక రాసింది. నిజానికి అవన్నీ అభూత కల్పనలు. నన్ను మంత్రివర్గంలోకి చేర్చుకునే సంగతిని అంతకుముందే నాకు చెప్పారు” అని ప్రణబ్ విపులంగా వివరించారు.
5. క్రిమియా ప్రధాని పర్యటనపై అమెరికా అభ్యంతరం
దిల్లీ/వాషింగ్టన్ డిసెంబర్12 (జనంసాక్షి) : అనుకున్నట్టుగానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు రిపబ్లిక్ ఆఫ్ క్రిమియా ప్రధాని సెర్జీ అక్సీనోవ్ భారత్‌లో పర్యటించడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా తీవ్రంగా స్పందించారు. పుతిన్‌తో పాటు ప్రతినిధుల బృందంలో క్రిమియా ప్రధాని ఉండడం మాకు ఇబ్బంది కలిగించిందని అమెరికా వ్యాఖ్యానించింది. ఈ విషయం భారత్‌కు తెలిసి ఉండదని భావిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు రష్యాతో సాధారణ సంబంధాలకు ఇది అనువైన సమయం కాదని అమెరికా వ్యాఖ్యానించింది. భారత్‌లో పుతిన్ పర్యటన సందర్భంగా అణు, రక్షణ రంగ, చమురు తదితర అంశాలపై ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రష్యాతో పలు ఒప్పందాలు కుదిరినట్లు తెలిసిందని, కానీ వాటి ప్రయోజనమేంటో తెలియదని పేర్కొంది. రష్యాతో సాధారణ సంబంధాలకు ఇది అనువైన సమయం కాదని మా ఉద్దేశ్యమని వ్యాఖ్యానించింది. మరోవైపు క్రిమియా ప్రధాని సెర్జీ అక్సీనోవ్ భారత పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకో పలు విమర్శలు చేశారు. సెర్జీకి అతిథ్యం ఇవ్వడం ద్వారా భారత్ విలువల కంటే ధనానికి ప్రాధాన్యమిస్తుందని విమర్శించారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణపై భారత్ స్పందన సరిగా లేదని పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా సెర్జీ.. వ్యవసాయం, ఫÛడ్ ప్రాసెసింగ్, పర్యటకం, మౌలిక వసతులు, ఔషధరంగంలో భారత పెట్టుబడులకు సంబంధించి జరిగిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు సెర్జీ పర్యటన తమ అధికార ప్రతినిధుల బృందంలో భాగం కాదని రష్యా పేర్కొంది.
భారత్ పర్యటన ఫలవంతం: పుతిన్
తన రెండు రోజుల భారత పర్యటన ఫలవంతంగా, అర్థవంతంగా ముగిసిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన పుతిన్.. గురువారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి భవన్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా రష్యాలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, డాక్యుమెంటరీలను రాష్ట్రపతికి పుతిన్ అందజేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా అభివృద్ధి చెందుతున్నాయని ఈ సందర్భంగా పుతిన్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను భారత్ గొప్ప మిత్రుడిగా పరిగణిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల రక్షణ సహకారం వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలకమని పేర్కొన్నారు. భారత రక్షణ అవసరాల్లో రష్యా అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని చెప్పారు. మరోవైపు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు రష్యా మద్దతును ఆయన అభినందించారు. భారత రక్షణ రంగంలో ఉత్పత్తి, పరిశోధనలకు రష్యా భాగస్వామ్యాన్ని రాష్ట్రపతి స్వాగతించారు.





