దిల్లీ/వాషింగ్టన్ డిసెంబర్12 (జనంసాక్షి) : అనుకున్నట్టుగానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు రిపబ్లిక్ ఆఫ్ క్రిమియా ప్రధాని సెర్జీ అక్సీనోవ్ భారత్‌లో పర్యటించడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా తీవ్రంగా స్పందించారు. పుతిన్‌తో పాటు ప్రతినిధుల బృందంలో క్రిమియా ప్రధాని ఉండడం మాకు ఇబ్బంది కలిగించిందని అమెరికా వ్యాఖ్యానించింది. ఈ విషయం భారత్‌కు తెలిసి ఉండదని భావిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు రష్యాతో సాధారణ సంబంధాలకు ఇది అనువైన సమయం కాదని అమెరికా వ్యాఖ్యానించింది. భారత్‌లో పుతిన్ పర్యటన సందర్భంగా అణు, రక్షణ రంగ, చమురు తదితర అంశాలపై ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రష్యాతో పలు ఒప్పందాలు కుదిరినట్లు తెలిసిందని, కానీ వాటి ప్రయోజనమేంటో తెలియదని పేర్కొంది. రష్యాతో సాధారణ సంబంధాలకు ఇది అనువైన సమయం కాదని మా ఉద్దేశ్యమని వ్యాఖ్యానించింది. మరోవైపు క్రిమియా ప్రధాని సెర్జీ అక్సీనోవ్ భారత పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకో పలు విమర్శలు చేశారు. సెర్జీకి అతిథ్యం ఇవ్వడం ద్వారా భారత్ విలువల కంటే ధనానికి ప్రాధాన్యమిస్తుందని విమర్శించారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణపై భారత్ స్పందన సరిగా లేదని పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా సెర్జీ.. వ్యవసాయం, ఫÛడ్ ప్రాసెసింగ్, పర్యటకం, మౌలిక వసతులు, ఔషధరంగంలో భారత పెట్టుబడులకు సంబంధించి జరిగిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు సెర్జీ పర్యటన తమ అధికార ప్రతినిధుల బృందంలో భాగం కాదని రష్యా పేర్కొంది.
భారత్ పర్యటన ఫలవంతం: పుతిన్
తన రెండు రోజుల భారత పర్యటన ఫలవంతంగా, అర్థవంతంగా ముగిసిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన పుతిన్.. గురువారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి భవన్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా రష్యాలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, డాక్యుమెంటరీలను రాష్ట్రపతికి పుతిన్ అందజేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా అభివృద్ధి చెందుతున్నాయని ఈ సందర్భంగా పుతిన్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను భారత్ గొప్ప మిత్రుడిగా పరిగణిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల రక్షణ సహకారం వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలకమని పేర్కొన్నారు. భారత రక్షణ అవసరాల్లో రష్యా అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని చెప్పారు. మరోవైపు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు రష్యా మద్దతును ఆయన అభినందించారు. భారత రక్షణ రంగంలో ఉత్పత్తి, పరిశోధనలకు రష్యా భాగస్వామ్యాన్ని రాష్ట్రపతి స్వాగతించారు.





