అభివృద్ధికి పుష్కలమార్గాలు
యువత మారకద్రవ్యాలకు బానిస కావద్దు
మణిపూర్ ఎన్నికల బహిరంగ సభలో నరేంద్రమోదీ
హైదరాబాద్, నవంబర్ 30 (జనంసాక్షి) : ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి పుష్కల మార్గాలు ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆయా రాష్ట్రాల్లో అపారమైన సంపద కొలువై ఉందని చెప్పారు. యువత మాదకద్రవ్యాలకు బానిస కావద్దని సూచించారు. మనిపూర్ ఎన్నికల బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన సంగాయి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మణిపూర్‌లో క్రీడా విశ్వవిద్యాలం ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిభ ఉన్న ఎందరో క్రీడాకారులను మణిపూర్ ఇచ్చిందన్నారు. దిల్లీ పోలీసులుగా ఈశాన్య రాష్ట్రాల యువతను నియమిస్తామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలను ఉన్నత శిఖరాలకు చేరుస్తామన్న ఆయన యువత మాదక ద్రవ్యాలకు అలవాటుపడటం బాధగా ఉందన్నారు. యువత చెడుమార్గంలో పయణించకుండా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలని ఆకాంక్షించారు. దేశంలో అధికంగా యువత జనాభా ఉండడం భారతదేశానికి గర్వకారణమని వివరించారు. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు యువత సేవలను సద్వినియోగం చేసుకోవాలని అంతిమంగా దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా కృషిచేయాలని సూచించారు. వేర్పాటు వాద విచ్ఛిన్నకర శక్తులను ఎక్కడికక్కడ అణిచివేయాలని పిలుపునిచ్చారు. యువత రాణిస్తేనే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు.





