ఉచిత ఇసుక విధానానికి తూట్లు
ర్యాంపులతో అక్రమంగా సంపాదన?
ఏలూరు,జూన్29(జనం సాక్షి : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఉచిత ఇసుక విధానం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. ఉచిత ఇసుక విధానం అమల్లో వచ్చిన ఇబ్బందులు అక్రమదారులకు భారీగా కాసులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించినా దీనికి పూర్తిస్థాయిలో విధివిధానాలు ప్రకటించకపోవడం వల్ల ర్యాంపులోకి వెళ్లి ఇసుక తెచ్చుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. దీంతో ర్యాంపుల నిర్వహణ అక్రమార్కుల చేతుల్లోనే ఉండిపోయాయి. అందుకే అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఉచిత ఇసుక విధానాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. అందుకే ప్రభుత్వం సదుద్దేశ్యంతో నూతన విధానం అమల్లోకి తీసుకుని వచ్చినా పేదవాడికి ఉచితంగా ఇసుక అందడం లేదు. ఇసుకను ఉచితంగా అందిస్తున్న ఘనత ఒక్క టిడిపి ప్రభుత్వానికే దక్కుతుంది. ఇటీవల గోదావరి నుంచి ఇసుకను ఉచిత ముసుగులో అక్రమంగా తరలించి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి ప్రస్తుతం అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి నది వెంబడి ఉన్న ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక రవాణా నిలిచిపోయింది. ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకంలో జిల్లాకు సుమారు 20వేల వరకూ ఇళ్లు మంజూరయ్యాయి. ఈ పనులను లబ్ధిదారులు ఇప్పటికే చేపట్టారు. మరికొన్ని వివిధ దశల్లోఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు ఏడు వేల వరకూ ఇళ్లు మంజూరయ్యాయి. ఇవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇసుక అవసరాలను ఆసరాగా చేసుకుని లారీల్లోనూ, ట్రాక్టర్లలోనూ, రోడ్లు, పోరంబోకు, పంట కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో వేసిన ఇసుకను అక్రమంగా అధిక ధరలకు అమ్ముకుని తమ జేబులు నింపుకుంటున్నారు. ఇదే అదనుగా రాత్రీ, పగలు తేడా లేకుండా విక్రయాలు ఊపందుకున్నాయి. వరదలకు ముందే నదీతీరం వెంబడి ఎక్కడి కక్కడే భారీగా ఇసుక నిల్వలు చేశారు. దీంతో ఇసుకకు డిమాండ్ పెరగడంతో అడ్డూఅదుపు లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక అయితే రూ.మూడు వేల నుంచి రూ.3500 వరకు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గోదావరికి వరద నీరు తగ్గకపోవడంతో భవిష్యత్‌లో ఇసుకాసురులు ధరను మరింత పెంచే యోచనలో ఉన్నారు. ఇకపోతే అక్రమాలను నిరోధించడంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అక్రమ ఇసుక దాఖలాలు లేవని సమాధానం ఇస్తున్నారు. పరివాహక ప్రాంతాల్లో అక్రమార్కులు తమ ఇష్టానుసారంగా ఇసుకను వివిధ ప్రాంతాల్లో గుట్టలుగుట్టలుగా నిల్వ చేసి సొమ్ము చేసుకుంటున్నారు.దీంతో సరైన లబ్దిదారులకు ఉచిత ఇసుక అందక లబోదిబోమంటూ తమ జేబులను గుల్ల చేసుకుని అప్పులపాలౌతున్నారు. ఇప్పటికైనా పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు చొరవ చూపి లబ్ధిదారులకు ఇసుక అందే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
————–