స్కూల్ బస్సును ఢీకొన్న రైలు
ఐదుగురు చిన్నారుల మృతి
లక్నో, డిసెంబర్ 4 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. గురువారం ఉదయం విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఐదుగురు చిన్నారులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో 20మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదం మావ్ సవిూపంలో జరిగింది. కాపలా లేని లెవల్ క్రాసింగ్ వద్ద ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఆకస్మికంగా వచ్చిన ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దట్టంగా కురుస్తున్న పొగ మంచు కారణంగా రైలు డ్రైవర్ కు బస్సు కనిపించక పోవడంతోనే ప్రాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదంలో స్కూలు బస్సు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కారణమయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో హృదయవిదాయకర దృశ్యాలు తల్లిదండ్రులను కలిచివేసాయి. గాయాలైన విద్యార్ధుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రైలు ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి విచారం వ్యక్తంచేసారు. ఆ కుటుంబాలను ఆదుకొంటామని హావిూ ఇచ్చారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. మెదక్ జిల్లా మాసాయిపేట ప్రమాదం మరవక ముందే ఈ ప్రమాదం జరగడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.





