Monday, 2 November 2026

దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం

7

జనతాదళ్‌ పునరేకీకరణ

సెక్యూలర్‌ శక్తులు ఏకం కావాలి

దేవేగౌడ, ములాయం, నితీశ్‌

ఢిల్లీ, డిసెంబర్‌ 4 (జనంసాక్షి) : దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరమని జనతా పార్టీలోని ఆరు పరివార్‌ పార్టీలు అన్నాయి. సెక్యూలర్‌ శక్తులు ఏకం కావాలని దేవేగౌడ, ములాయం సింగ్‌, నితీశ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. జనతాదళ్‌ పునరేకీకరణ కానుంది. మరోవైపు పార్లమెంటుకు వెలుపల తొలిసారి ఉమ్మడిగా ఎస్‌పీ, జనతాదళ్‌(ఎస్‌), రాష్గీయ జనతా దళ్‌, జనతా దళ్‌(యూ), ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌, సమాజ్‌వాదీ జనతా పార్టీ డిసెంబరు 22న ధర్నా నిర్వహించనున్నాయి. ప్రతిపక్ష శక్తులు ఏకం కావాలనే లక్ష్యంతో ఒకప్పటి ‘జనతా పరివార్‌’ మళ్లీ ఒక్కటి కానుంది. ఎస్‌పీ, జనతాదళ్‌(ఎస్‌), రాష్గీయ జనతా దళ్‌, జనతా దళ్‌(యూ), ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌, సమాజ్‌వాదీ జనతా పార్టీలు అన్నీ కలిసి ఒకే పార్టీగా అవతరించేందుకు అంగీకరించాయి. ఈ విలీన ప్రక్రియకు సంబంధించి విధివిధానాల కసరత్తును సమాజ్‌వాదీ పారీ(ఎస్‌పీ) అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ పర్యవేక్షిస్తారని జనతా పరివార్‌లోని ఆరు పార్టీలు పేర్కొన్నాయి. విదేశాల్లో పోగుపడిన నల్లధనాన్ని వెనక్కిరప్పించడం, రైతాంగ సమస్యల నుంచి తప్పుకోవడం, నిరుద్యోగం తదితర అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించేందుకు ఆ పార్టీలు నిర్ణయించాయి. గురువారం ములాయం అధికారిక నివాసంలో ఆరు పార్టీల నేతల సమావేశం జరిగింది. అనంతరం జేడీయూ నేత నితీష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఆరు పార్టీలు ఒక్కతాటిపైకి రానున్నాయని, అందుకు సంబంధించిన విధివిధానాల కసరత్తును ములాయం పర్యవేక్షిస్తారని చెప్పారు. అయితే ఈ విలీనంపై ఏమైనా సందిగ్ధత ఉందా? అని విలేకరులు అడగ్గా.. అందరి సిద్ధాంతాలు, తత్వాలు ఒక్కటేనని, ఒక పార్టీ ఉండాలని అందరూ భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దూకుడుకు తట్టుకోలేకనే ఒక్కటవుతున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒక వేదిక కావాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. మాతో పనిచేసేందుకు ముందుకు వచ్చే అన్ని పక్షాలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. మరోవైపు జనతా పరివార్‌ పార్టీల విలీనంతో రాజ్యసభలో ఆ పార్టీల సంఖ్యాబలం పెరుగనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో భాజపాకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓబీసీ ఓటు బ్యాంకు వైపు భాజపా చొచ్చుకు వస్తున్న నేపథ్యంలో జనతా పరివార్‌ ఏకీకరణ రక్షణగా ఉపయోగపడగలదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *