Monday, 2 November 2026

ఉద్యోగులకు ఖుష్‌ ఖబర్‌

2
జనవరిలో పీఆర్సీ కానుక

మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం

టీఎన్‌జీవోల డైరీ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి): తెలంగాణ ఎన్జీవోలకు కొత్త సంవత్సర కానుకగా జనవరి మూడో వారంలో పిఆర్సీ ప్రకటిస్తానని సిఎం కెసిఆర్‌ హావిూఇచ్చారు. ఉద్యోగులు మనస్ఫూర్తిగా ఆహ్వానించేలా పిఆర్సీ ఉంటుందన్నారు. దీనికి సంబంధించి లెక్కలు తీయమని అధికారులను ఆదేశిస్తానని అన్నారు. అలాగే వృధాగా పడివుండి, ప్రభుత్వానికి గుదిబండగా తయారైన రాజీవ్‌ స్వగృహ ఇళ్లను కూడా ఎన్జీవోలకు అప్పగిస్తానని అన్నారు. టీఎన్జీవో డైరీ, క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నగరంలోని రవీంద్రభారతీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల, మహేందర్‌ రెడ్డి, ప్రొ.కోదండరాం, పలువురు ఎమ్మెల్యేలు, టీఎన్జీవో నేత దేవీప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా  సిఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్నివర్గాల పేదలను ఆదుకుంటామని  అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల విభజన పూర్తికాలేదు కనుక కొన్ని ఇబ్బందులు వున్నాయని పేర్కొన్నారు. కొత్త పథకాలు తీసుకువచ్చినప్పుడు అమలు చేయడంలో ఆలస్యమవుతుందని ఆయన అన్నారు. ఎన్జీవోల హెల్త్‌ కార్డులకు సంబంధించి కూడా సిఎం స్పష్టమైన ప్రకటన చేశారు. వారి కుటుంబాలకు లిమిట్‌ లేకుండా వైద్య సేవలు అందిస్తామని అన్నారు. దేశంలోనే ఆదర్శంగా ఈ పథకం అమలు చేస్తమాన్నారు. ఆదాయం వస్తే అదనపు ఇంక్రిమెంట్‌ కూడా ఇస్తామని చెప్పారు. ఉద్యోగులతో గతంలో చెప్పిన మాదిరిగానే ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ ఉంటుందన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా తక్షణం పరిష్కరిస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పోషించిన చాలా ప్రధానమైనదని  స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన సకల జనుల సమ్మెలో టీఎన్జీవోలు నిర్వహించిన పాత్ర అద్భుతమైనదని, అపూర్వమైనదని శ్లాఘించారు. ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన సంస్థ టీఎన్జీవో అని పొగిడారు. టీఎన్జీవోల ఉద్యమంతో ఏదైనా ఆగిపోవచ్చు గాక తెలంగాణ ఉద్యమం ఆగిపోదని నిరూపించామని అన్నారు.  ప్రొఫెసర్‌ కోదండరాంతో కలిసి విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. ఇవాళ టీఎన్జీవోల డైరీని ఆవిష్కరిస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. గత సంవత్సరం డైరీ ఆవిష్కరిస్తూ వచ్చే సంవత్సరం నూతన సంవత్సర డైరీని కొత్త రాష్ట్రంలోనే ఆవిష్కరించుకుంటామని సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఈ డైరీ ఆవిష్కరణకు రావడం, వారితో కలసి మాట్లాడడం ఆనందంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *