Tuesday, 3 November 2026

ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే ఘర్‌ వాపసీ

1f
నేడు జనతా పరివార్‌ మహాధర్నా

దిల్లీ,డిసెంబర్‌, 21 (జనంసాక్షి) : జనతా పార్టీ పరివార్‌కు చెందిన ఆరు ప్రధాన భాగస్వామ్యపక్షాలు నేడు ఢిల్లీలో మహాధర్నా కార్యకమ్రం నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. మోడీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు పార్టీల అగ్రనేతలంతా అస్త్రశస్త్రాలు సిద్ధంచేశారు. ఆరు పార్టీలకు చెందిన అగ్రనేతలు ఒకే వేదికపై నుంచి ప్రసంగించనున్నారు. మహాధర్నా తర్వాత భాగస్వామ్య పార్టీలన్నీ ఒక్కొక్కటిగా ఒకదానితో మరోటి కలిసిపోయి జేడీయు మహాకూటమి ఏర్పడుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగా సోమవారం మహాధర్నా సందర్భంగానే బీహార్‌లో నితిష్‌కుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న జేడీయు, లల్లూ ప్రసాద్‌ యాదవ్‌ సారథ్యంలో నడుస్తున్న ఆర్జేడీలు ఒక్కటవుతాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది బీహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీహార్‌లో అనూహ్యంగా పుంజుకుంటున్న బీజేపీని ఎలాగైనా ఓడించేందుకు ఈ రెండు పార్టీలు విలీనమవుతాయని జేడీయుకు చెందిన ఓ సీనియర్‌ నేత అన్నారు. అయితే కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన జేడీఎస్‌, సమాజ్‌వాదీ పార్టీలకు అంత తొందరేం లేదని అభిప్రాయపడ్డారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు 2017లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్టీలు కాస్త నెమ్మదిగా కలిసిపోయినా, ప్రస్తుతానికి జేడీయు, ఆర్జేడీలు మాత్రం కలిసిపోతాయని, మహాధర్నాలో ప్రకటన వెలువడుతుందని సమాచారం.  ఈ మహాధర్నాలో బీహార్‌ మాజీ సీఎం నితిష్‌కుమార్‌తోపాటు జేడీయు అధినేత శరద్‌ యాదవ్‌, ఆర్జేడీ అధినేత లల్లూ ప్రసాద్‌ యాదవ్‌ హాజరుకానున్నారు. దీంట్లోనే పార్టీల విలీనానికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత కొద్ది నెలల క్రితం జరిగిన ఉపఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కలిసి నష్టాన్ని బాగానే పూడ్చుకున్నాయి. జనతాదల్‌ పార్టీల విలీనానికి సంబంధించి జరగనున్న మహాధర్నా పార్టీల ఏకీకరణలో కీలకమైన మైలురాయని పార్టీల ఐక్య కూటమి కోసం తీవ్రంగా కృషిచేస్తున్న శరద్‌ యాదవ్‌ అన్నారు. అయితే దానికోసం ఎలాంటి డెడ్‌ లైన్‌ లేదన్నారు.

పార్టీల విలీనానికి సంబంధించి గత కొంత కాలంగా రహస్యంగా సాగుతున్న మంతనాలకు సమాజ్‌వాదీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ ఇటీవల న్యూ ఢిల్లీలోని తన నివాసంలో ఐదు పార్టీల నేతలు ఇచ్చిన విందు సందర్భంగానే బయటికి తెలిసింది. జంతర్‌ మంతర్‌లో జరగనున్న మహాధర్నాలో ఈ పార్టీల నేతలంతా పాల్గొననున్నారు. మరోవైపు ఆర్జేడీ, ఎస్పీల అధినేతల మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా ఏర్పడ్డాయి. లల్లూ కుమార్తె రాజ్‌లక్ష్మిని ములాయం మనవడు, ఎంపీ తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పెళ్లిచేసుకోబోతున్నారు. గతంలో బీజేపీని ఎదుర్కోవటానికి కూటమి అవసరం లేదన్న లల్లూ ఇప్పుడు దానికోసం మొగ్గుచూపటం గమనార్హం.

మరోవైపు హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారంతా తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాలంటూ ఉత్తరాదిలో సంఘ్‌ పరివార్‌ చేపట్టిన ‘ఘర్‌ వాపసీ’ కార్యక్రమంపై బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌  మండిపడ్డారు. హిందూవులను బలవంతంగా మతం మార్చవద్దని మైనార్టీలకు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన విజ్ఞప్తిని నితీష్‌ తప్పుబట్టారు. మోహన్‌ భగవత్‌ చేసిన తాజా వ్యాఖ్యలు దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఘర్‌ వాపసీ కార్యక్రమంతో  దేశంలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటాయన్నారు. జనతా దళ్‌ యునైటెట్‌ మరియు ఇతర పార్టీలు ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరిని సమర్ధించకపోయినా.. బీజేపీ మాత్రం అందుకు వంత పాడుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *