2012-13 సంవత్సర నివేదికను సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
మైనింగ్ అనుమతుల్లో అవకతవకలు
సివిల్‌సప్లైపై తీవ్ర అసంతృప్తి
బోగస్ కార్డుల వల్ల 1136కోట్ల నష్టం
హైదరాబాద్, నవంబర్ 28 (జనంసాక్షి) : ఉమ్మడి రాష్ట్రానికి కాగ్ అక్షింతలు వేసింది. వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో అవకతవకలను కాగ్ (కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్) ఎండగట్టింది. 2012-13 సంవత్సరం కాగ్ నివేదికను ప్రభుత్వం శుక్రవారం శాసన సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక, రెవెన్యూ, గనులు, సమాజిక రంగాలపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సామాజిక పింఛన్ల
నిర్వహణలో ఆర్థిక లోపాలు ఉన్నాయని కాగ్ పేర్కొంది. పౌర సరఫరా వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దరఖాస్తుల స్వీకరణ, మంజూరుకు సరైనరిజిస్టర్లు లేవని తెలిపింది. పింఛన్ల మంజూరు, చెల్లింపులపై ప్రభుత్వ పర్యవేక్షణ పటిష్టంగా లేదని చెప్పింది. దీనివల్ల ప్రజా ధనం వృధా అయిందని తెలిపింది. ఇందిరమ్మ గృహాలకు 2008- 2013 మధ్యకాలంలో పూర్తిస్థాయి నిధులు ఇవ్వలేదని తెలిపింది దీనివల్ల లక్షల గృహాల పనులు మధ్యలోనే నిలిచిపోయాయని కాగ్ తమ నివేదికలో పేర్కొంది.తెల్ల రేషన్ కార్డు కలిగి,దారిద్య రేఖకు దిగువున ఉన్న వారు మాత్రమే ఇందిరమ్మ గృహాలకు అర్హులని ప్రకటించిన ప్రభుత్వం గులాబి రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా ఇళ్లు మంజూరు చేసిందని వెల్లడించింది. పౌరసరఫరాల శాఖలో నిధులు సరిగా వినియోగించలేదని, బోగస్ కార్డుల వల్ల ప్రభుత్వంపై రూ. 1,136 కోట్ల భారం పడుతుందని తెలిపింది. చౌకధరల దుకాణాల హేతుబద్ధీకరణ చేపట్టలేదని దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని తేల్చింది.. చౌకధరల దుకాణాల పనితీరులో లోపాలున్నాయని తెలిపింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో పటిష్ట పర్యవేక్షణ లేదని నివేదించింది. ఇసుక రీచ్‌ల వేలంలో ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగిందని తెలిపింది. రెవెన్యూ శాఖ అనుమతి లేకుండా ఖనిజ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని, నీటిపారుదుల పనుల ఎంపిక లో లోపాలు ఉన్నాయని పేర్కొంది. ప్రాజెక్టుల ప్రణాళిక సరిగా లేక సాగునీటి కల్పన లక్ష్యం నెరవేరలేదని చెప్పింది. 1876 ఎత్తిపోతల పథకాలకు 236 మాత్రమే పాక్షికంగా పని చేస్తున్నాయని తెలిపింది. 2008 తర్వాత నీటిసంఘాల ఎన్నికలు జరగలేదన్నారు. ప్రభుత్వ, ప్రవేటు భాగస్వామ్య రోడ్ల నిర్మాణంపై ప్రమాణిక విధానం లేదంది. ట్రాఫిక్ స్వల్పంగా ఉన్నప్పటికీ కడప-పులివెందుల మధ్య నాలుగు లైన్ల రోడ్లు వేశారని ఆరోపించింది. కరీంనగర్-హైదరాబాద్ రహదారిలో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందన్నారు. హైదరాబాద్-రామగుండం రహదారిలో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపింది. మిర్యాలగూడ-కోదాడ రోడ్డులో మూసీ వంతెన వద్ద రూ. 69 కోట్ల అదనపు టోల్ భారం పడుతుందని పేర్కొంది.





