ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్, నవంబర్ 28 (జనంసాక్షి) : తెలంగాణలో రైతుల సమస్యలపై మరో ఉద్యమం నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. రైతుల్లో విశ్వాసం కల్పించి ఆత్మహత్యలు నివారించేందుకు తెలంగాణ ఉద్యమం తరహాలో… ప్రజాస్వామ్యయుతంగా మరో ఉద్యమం నిర్మిద్దామని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల నేపథ్యంలో ఎన్నో శక్తులు దాడి చేస్తూ రైతును చిదిమేస్తున్న దృష్ట్యా…. అన్ని వర్గాల రైతులు సంఘటితం కావాలని కోరారు. నూతన ఆర్థిక సరళీకరణ విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాతే… వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. గిట్టుబాటు ధర లభించక అప్పుల వూబిలో కొట్టుమిట్టాడుతూ అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంధాలయం సమావేశ మందిరంలో ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, పరిశోధన విభాగం సంయుక్త ఆధ్వర్యంలో… వ్యవసాయ సంక్షోభం- రైతుల ఆత్మహత్యలపై జరిగిన సదస్సుకు కోదండరాం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, తదితరులు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. రైతు ఆత్మహత్యలపై వక్తలు ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వ నిర్వాకం వల్లే రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి గతి లేక ఆత్మ హత్యలు చేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.





