ఎంసెట్ మెడికల్ పేపర్ లీకేజీ ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రాజగోపాల్ రెడ్డిని సీఐడీ అరెస్ట్ చేసింది. ఆయన బెంగళూరుకు చెందిన వ్యక్తి. దాదాపు 80 కోట్ల రూపాయల మేర ఈ స్కాం జరిగింది. 40 మంది ప్రత్యక్షంగా లాభపడినట్లు తేలినా దాదాపు 130 మంది విద్యార్థులకు లీకయివుంటుందని సీఐడి అనుమానిస్తోంది. కేసులో అత్యంత కీలకమైన ఖలీల్ అనే మరో వ్యక్తి కోసం గాలింపు జరుగుతోంది. ఢిల్లీ లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఖలీలే ఎంసెట్ పేపర్లను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముంబై కేంద్రంగా ఈ ఆపరేషన్ సాగినట్లు స్పష్టమయ్యింది. వివరాలతో కూడిన నివేదికను సీఐడీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేసింది. ఆయన దీన్ని పరిశీలించి ఈ సాయంత్రం తన నిర్ణయాన్ని వెలువరిస్తారని భావిస్తున్నారు. పరీక్షను రద్దు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం. రద్దు చేస్తే మంచిదా లేక రీర్యాంకింగ్ చేస్తే సరిపోతుందా దేని వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని విశ్లేషిస్తున్నారు.
ఎంసెట్ రద్దుపై సాయంత్రంలోగా నిర్ణయం




