లండన్,జనవరి17(జనంసాక్షి): పాకిస్తాన్‌లో అమలు చేస్తున్న తీవ్రవాదుల మరణశిక్షల పరంపర పట్ల ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పెషావర్‌లో సైనికపాఠశాలపై తీవ్రవాదుల ఘాతుక చర్య అనంతరం పాక్‌లో కొనసాగుతున్న మరణశిక్షల అమలును తక్షణం నిలిపేయాల్సిందిగా కోరింది. మరణశిక్షల అమలుపై అంతకుముందు విధించి ఉన్న పరిమితులను రద్దుచేయడం పట్ల ఆమ్నెస్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రవాద హింసను ఎదుర్కోవడానికి మరింత మందిని చంపేయడం సమాధానం కానేకాదని పేర్కొంది.
మరణశిక్ష పడిన సుమారు అయిదువందల మంది తీవ్రవాదులను కచ్చితంగా ఉరికంబం ఎక్కిస్తామంటూ పాకిస్తాన్ హెచ్చరించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. నేరాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు రుజువు చేసుకోవడానికి …పెద్దసంఖ్యలో మరణశిక్షలను అమలు చేయడమనేది సరైన పద్ధతి కానే కాదని ‘ఆమ్నెస్టీ’కి చెందిన అత్యున్నతస్థాయి అధికారి డేవిడ్ గ్రిఫిత్స్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌లో అక్రమ విచారణలతో సరిపుచ్చి… ఎడాపెడా మరణశిక్షలను విధించేయడం అత్యంత కలవరపరుస్తున్న అంశం అని పేర్కొన్నారు. తీవ్రవాదానికి సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ..వాటిని సైనిక కోర్టులకు బదలాయించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ దిశగా గత కొన్నివారాల క్రితం కొన్ని రాజ్యాంగ సవరణలు సైతం చేసింది. ఇది కూడా అత్యంత కలవరపరచే పరిణామమేనని ‘ఆమ్నెస్టీ’ పేర్కొంది.





