ఎన్టీఆర్ బాటలోనే బాబు సంక్షేమ కార్యక్రమాలు
విశాఖపట్నం,నవంబర్7(జనంసాక్షి): స్వర్గీయ ఎన్టీఆర్ బాటలోనే చంద్రబాబునాయుడు ప్రజలే దేవుళ్లుగా ముందుకు సాగుతున్నారని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పెందుర్తి నియోజకవర్గం పారిశ్రామికంగా, విద్యా హబ్‌గా, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. సోమవారం సాయంత్రం పెందుర్తిలో జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా విశాఖలో 51వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి సంచలనం సృష్టించారన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూల్లో పెందుర్తి సీహెచ్‌సీ, పాలిటెక్నిక్ కళాశాల, గృహ నిర్మాణ పథకాలు, ఏసీ కల్యాణ మండపం సారమవుతున్నాయన్నారు. చినముషిడివాడలో మినీ స్టేడియం నిర్మాణానికి వుడా ప్రతిపాదనలు ఉన్నాయని, నిధుల మంజూరుకు మంత్రి గంటా సహకరించాలని కోరారు. ఏపీ టిడ్కో నుంచి 5వేల ఇళ్లు మంజూరు కానున్న నేపథ్యంలో అ/-దదె ఇళ్లలో ఉంటున్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే సూచన మేరకు 71వ వార్డు కామాక్షి అమ్మవారి ఆలయం వద్ద సామాజిక భవనం నిర్మాణానికి రూ. 20లక్షల ఎంపీ నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖలో మహిళల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బండారు, ఎంపీ ముత్తంశెట్టి సూచనలకు మంత్రి గంటా సానుకూలంగా స్పందించారు.