ఎన్డీఎ నుంచి వచ్చాక దమ్మిడి రాలేదు: యనమల

అమరావతి,మే28( జ‌నం సాక్షి ): ఎన్డీఏ నుంచి బయటికి వచ్చాక.. కేంద్రం నుంచి ఏపీకి రూపాయి రాలేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ కావాలనే ఏపీకి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు యూసీల పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. యూసీలు సమర్పించడంలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. ఏపీ ఎప్పటికప్పుడు యూసీలు అందజేస్తోందని తెలియజేశారు. కానీ అమిత్‌ షా మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిధులు ఎగ్గొట్టేందుకు ఇదో కొత్త నాటకమన్నారు. యూసీలు ఇవ్వకుండా కేంద్రం నిధులు విడుదల చేయదన్నారు. ఈ విషయాన్ని అమిత్‌షా తెలుసుకోవాని యనమల సూచించారు. ఇదిలావుంటే మహానాడు సక్సెస్‌ కావడంతో ప్రత్యర్థి పార్టీలకు కడుపు మండిపోతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్‌, పవన్‌ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. వారిద్దరికి గట్స్‌ ఉంటే కేంద్రాన్ని నిలదీయాలని కోరారు. పవన్‌పై దాడులు చేసేంత సమయం తమకు లేదన్నారు. పవన్‌ ఎక్కడ ఉంటారో.. ఏ గుళ్ల వెంట తిరుగుతారో.. ఏ గుహల్లోకి వెళ్తారో చూసే తీరిక తమకు లేదని మంత్రి తెలిపారు.