Tuesday, 3 November 2026

ఎన్నారైలకు ఈ-ఓటింగ్‌ – సుప్రీం

2న్యూఢిల్లీ,జనవరి12(జనంసాక్షి):  విదేశాలలో నివసిసున్న ప్రవాస భారతీయులకు ఈ – ఓటింగ్‌ అవకాశం కల్పించాలని, ఎనిమిది వారాల్లోగా ఈ అవకాశం ప్రవాస భారతీయులకు అందుబాటులోకి తేవాలనీ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే విదేశాల్లో నివాసం ఉంటూ భారతీయ పాస్పోర్టు కలిగి ఉన్నివారికి ఈ-బ్యాలట్‌ ఇచ్చేందుకు తాము ఇప్పటికే అంగీకరించామని, అవసరమైన చట్టాలను సవరించి దాన్ని అమలులోకి తెస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దాంతో వీలైనంత త్వరగానే ఈ-బ్యాలట్‌ ఓటింగును అమలుచేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి చెప్పింది. ప్రపంచం నలుమూలలా సుమారు 1.1 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉన్నట్లు అంచనా. సుప్రీంకోర్టు ఆదేశాలతో వారందరికీ ఊరట కలిగినట్లయింది. విధానంలో ముందుగా ఓ ఖాళీ పోస్టల్‌ బ్యాలట్‌ పేపర్ను ఓటర్లకు ఈమెయిల్‌ చేస్తారు. వారు దాన్ని పూర్తిచేసి, సంబంధిత నియోజకవర్గానికి పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇందులో కొంతవరకు అక్రమాలు, రిగ్గింగ్‌ లేదా రహస్య ఓటింగు లేకపోవడం లాంటి ఇబ్బందులు లేకపోలేవని ఎన్నికల కమిషన్‌ తన నివేదికలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *