ఎన్నికల్లో సీట్లకోసం ఏపీని ఏకాకిని చేయకండి
– 25ఎంపీ సీట్లతో ఎలా చక్రం తిప్పుతారో చంద్రబాబు, జగన్ చెప్పాలి
– నిజంగా యూసీలు ఇచ్చుంటే ఆన్‌లైన్‌లో పొందుపర్చండి
– రమణదీక్షితులు ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపితే తప్పేంటి?
– లైవ్ ఇవ్వకపోతే కర్ణాటకలో బీజేపీనే ఉండేది
– మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
రాజమండ్రి, మే30(జనం సాక్షి) : ఎన్నికల్లో సీట్ల కోసం రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ఏపీని ఏకాకిని చేయవద్దని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 25ఎంపీ సీట్లతో కేంద్రలో ఎలా చక్రం తిప్పుతారో చంద్రబాబు, జగన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టించి ఒకడుగు ముందుకేశారన్నారు. ఏపీ విభజన రాజ్యాంగ బద్ధంగా జరగలేదని, విభజన బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా పాస్ చేశారని ఉండవల్లి తెలిపారు. విభజన బిల్లు ఆమోద సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. ‘ఓటింగ్ సరిగా నిర్వహించలేదని, పార్లమెంట్ తలుపులు మూసేసి ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. లైవ్ ప్రసారాలు ఉండి ఉంటే ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలిసేవన్నారు. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షను లైవ్ టెలికాస్ట్ చేయకపోతే బీజేపీ అధికారంలో ఉండేదని సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులపై స్పష్టం చేయాలని రాష్ట్రం మొత్తం కోరినా చంద్రబాబు స్పందించక పోగా.. విూకు అడిగే హక్కు లేదన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. అడిగే హక్కు ఎవరికి ఉందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి యూసీలు పంపించామని
చంద్రబాబు అంటుంటే తమకు రాలేదని కేంద్రం చెబుతుందని, నిజంగా యూసీలు ఇచ్చుంటే ఆన్‌లైన్‌లో పొందుపరచండని చంద్రబాబును ఉండవల్లి ప్రశ్నించారు. అప్పుడే చంద్రబాబుపై ప్రజలకు విశ్వాసం ఉంటుందని ఉండవల్లి సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీపై జేసీ దివాకర్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలపై బీజేపీ నేతలు స్పందించాలన్నారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే ఏపీకి అన్యాయం జరుగుతోందంటూ ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపితే తప్పేంటని సీఎం చంద్రబాబును ఉండవల్లి ప్రశ్నించారు. 2008 అసెంబ్లీ సమావేశాల్లో టీటీడీ నిర్వహణపై చంద్రబాబు సీబీఐ విచారణ కోరిన విషయాన్ని ఈ సందర్భంగా మాజీ ఎంపీ గుర్తుచేశారు. నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డులో ఎలా నియమిస్తారో చెప్పాలని చంద్రబాబును ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.