Tuesday, 3 November 2026

ఎన్నికల వేళ ఇద్దరి ఔట్‌

బన్సల్‌, అశ్వనీకుమార్‌పై వేటు
ప్రధానితో చర్చించాక రాజీనామా చేసిన కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ, మే 10 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే మంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌తో పాటు బొగ్గు కుంభకోణం దర్యాప్తు నివేదికను సుప్రీంలో సమర్పించకముందే చూసి సవరణలు చేసిన న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్‌పై వేటు వేసింది. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బన్సల్‌పై వేటు తప్పదని, అశ్వనీకుమార్‌కు మాత్రం శాఖ మార్పుతోనే సరిపెట్టవచ్చంటూ వార్తలు వెలువడ్డాయి. సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసానికి చేరుకొని మంత్రుల వ్యవహారంపై చర్చలు జరిపారు. చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ప్రధానికి సూచనలు చేశారు. రైల్వే శాఖలో ఉన్నతోద్యోగం ఇప్పించేందుకు బన్సాల్‌ మేనల్లుడు విజయ్‌సింగ్లా ఓ ఉన్నతాధికారి నుంచి రూ. 90 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ కేసులో భాగంగా సీబీఐ బన్సాల్‌ను కూడా ప్రశ్నించనుంది. ఆయన పాత్రతో పాటు కార్యాలయం పాత్ర, కుటుంబ సభ్యులపైనా ఆరా తీయనుంది. ఆయన మంత్రిగా విచారణకు హాజరైతే కేంద్రానికి మచ్చ వస్తుందనే యోచనలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉన్నట్లుగా సాయంత్రం వార్తలు వెలవడ్డాయి. ఈనేపథ్యంలో ప్రధానితో భేటీ అయిన బన్సల్‌ తన మేనల్లుడి వ్యవహారంపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ప్రధాని అప్పటికే ఒక నిర్ణయానికి రావడంతో ఆయన సూచన మేరకు పదవికి రాజీనామా చేశారు. కోల్‌గేట్‌ వ్యవహారంలో సీబీఐ చేపట్టిన దర్యాప్తులో చేయిపెట్టిన న్యాయ మంత్రి అశ్వనీకుమార్‌ వల్ల కేంద్రానికి కలిగిన అప్రతిష్ట నుంచి బయటపడేందుకు రాజీనామా సరైందని ప్రధాని చెప్పడంతో ఆయన అనివార్యంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. మొత్తంగా ఒకే రోజు ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికి కాంగ్రెస్‌ పార్టీ అవినీతిని ఉపేక్షించబోమనే సంకేతాలు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *